హైదరాబాద్ ,మే 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ సందర్శన మరియు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను పురస్కరించుకుని నగరంలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. వివిఐపిల కదలికలు, భద్రతా కారణాల దృష్ట్యా ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు కీలక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు మరియు నిలిపివేతలు ఉంటాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల మధ్య బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హైటెక్స్ (HICC) వరకు ఉండే ప్రధాన మార్గాల్లో ప్రయాణించవద్దని పోలీసులు పౌరులను కోరారు.
బేగంపేట, గ్రీన్‌ల్యాండ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, ఎన్.ఎఫ్.సి.ఎల్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం. 36, సైబర్ టవర్స్ మరియు శిల్పారామం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని ఎం.జి. రోడ్, ఆర్.పి. రోడ్ మరియు ఎస్.డి. రోడ్ మార్గాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణీకులు ట్రాఫిక్ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని గంట ముందే బయలుదేరాలని, సాధ్యమైనంత వరకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 అందుబాటులో ఉంటుందని, ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదురైతే సోషల్ మీడియా వేదికల ద్వారా సంప్రదించవచ్చని జాయింట్ కమిషనర్ తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వాహనదారులు పోలీసులకు సహకరించి తమ ప్రయాణాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేసేలా చూసుకోవాలని అధికారులు కోరారు.

