పర్యాటకులను ఆకట్టుకునేలా విశాఖలోని కైలాసగిరిపై రూ.3 కోట్లతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ను మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. తుపాన్లు, ప్రచండ గాలులనూ తట్టుకునేలా దీన్ని నిర్మించారు. త్రిశూలం పొడవు 65 అడుగులైతే… అందులో ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంది. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా కనిపించేలా ఎత్తయిన కొండపై నిర్మించడమేగాక.. త్రిశూలం వెలుగులు విరజిమ్మేలా లోపల ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణు కుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల శ్రీనివాస్, లోకం మాధవి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
