నర్సింగ్ విద్యలో నవశకం..బేగంపేట్‌లో ‘ప్రధానాచార్యుల’ మేధోమథనం.

బేగంపేట మే 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్నిపురస్కరించుకుని నర్సింగ్ విద్యా రంగంలో సమూల మార్పులు, భవిష్యత్తు సవాళ్లపై బేగంపేట్‌లోని తాజ్ వివంతా హోటల్‌లో శనివారం నర్సింగ్ ప్రధానాచార్యుల రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. విజన్ హెల్త్ సైన్సెస్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులోతెలంగాణవ్యాప్తంగా సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యావేత్తలు పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి. విద్యుల్లత, గౌరవ అతిథిగా ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ముప్పిడి రాజేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజన్ హెల్త్ సైన్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ భరత్ పారిక్ మాట్లాడుతూ.. ఆధునిక నర్సింగ్
వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆశయాలకు అనుగుణంగా నర్సింగ్ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత కళాశాలలపై ఉందన్నారు. విద్యా రంగంలో బోధన, అభ్యాస ప్రక్రియలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు నాణ్యమైన పాఠ్యపుస్తకాల అవసరాన్ని ఆయన చెప్పారు.
అనంతరం జరిగిన ప్యానెల్ చర్చలో నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఎదుర్కొంటున్న సమకాలీన సవాళ్లు, పరివర్తనాత్మక వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తులో నర్సింగ్ నాయకులను తయారు చేయడంలో ప్రిన్సిపాల్స్ పాత్ర కీలకమని, కేవలం యథాతథ స్థితిని కొనసాగించకుండా వినూత్న మార్పులు తీసుకురావాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కరుణతో కూడిన
నాయకత్వం, వృత్తిపరమైన సేవలపై నర్సింగ్ అధికారులకు అవగాహన కల్పించాలని ఎయిమ్స్ బీబీనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జైసన్ జోసెఫ్, మల్లారెడ్డి నర్సింగ్ కళాశాల డీన్ డాక్టర్ ఎన్. బాల సుబ్రమణియన్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నర్సింగ్ అధికారులు, ప్రముఖ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన నర్సింగ్ పుస్తక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *