హైదరాబాద్ మే 17, (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం మరో అద్భుతమైన తీపి కబురు అందించింది.
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి – తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును మంజూరు చేసినందుకు రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కేంద్ర మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నూతన వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మే 17, (ఆదివారం) నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి
రైలు ప్రయాణ వివరాలు
ట్రైన్ నెంబర్ 17059 (చర్లపల్లి – తిరుచానూరు): ప్రతి ఆదివారం రాత్రి గం 21:30 లకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు
తిరుచానూరు చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 17060 (తిరుచానూరు – చర్లపల్లి): తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం సాయంత్రం 16:00 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 08:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
రైలు ఆగే ప్రధాన కేంద్రాలు
ఈ రైలు చర్లపల్లిలో ప్రారంభమై మల్కాజ్‌గిరి, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ మీదుగా డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మరియు రేణిగుంట జంక్షన్ స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం మరియు సుదీర్ఘ ప్రయాణాన్ని సుఖమయం చేయడం కోసం ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో కలిపి మొత్తం 20 అత్యాధునిక కోచ్‌లను ఏర్పాటు చేశారు.హైదరాబాద్ శివార్లలో కొత్తగా అభివృద్ధి చెందిన చర్లపల్లి టెర్మినల్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు, ఈ రైలు ప్రయాణించే తెలంగాణ మరియు రాయలసీమ జిల్లాల ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో అనుకూలంగా మారనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన రెగ్యులర్ రైలు సౌకర్యాన్ని ప్రయాణికులు, భక్తులు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు.
