ఎఫ్‌ఎల్‌ఎన్ 3.0 శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారిణి సి.వి. రేణుక

ప్రకాశం జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్ 3.0) శిక్షణా కార్యక్రమం రామచంద్ర మిషన్‌లో నిర్వహించబడుతోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారిణి సి.వి. రేణుక సందర్శించి, శిక్షణలో పాల్గొంటున్న డీఆర్పీలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రాథమిక భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ప్రకాశం జిల్లాను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు, డీఆర్పీలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెరిగి ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.
జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, తల్లిదండ్రులతో ముందస్తు సమావేశాలు నిర్వహించి విద్యార్థుల హాజరు పెంపునకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు తమ సెలవులను అవసరమైన మేరకే వినియోగించుకుని విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలకు కృషి చేయాలని, కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, షూస్, బెల్టులు, సాక్సులు తదితర సామగ్రిని కిట్ రూపంలో అందజేస్తోందని, అలాగే “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రవేశాలు నమోదవుతున్నాయని పేర్కొంటూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతి డీఆర్పీ పాఠశాల స్థాయికి తీసుకెళ్లి ప్రతి విద్యార్థికి చేరేలా కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంఓ నాగేంద్ర నాయక్, జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం, శిక్షణ పరిశీలకులు సౌజన్య, కేఆర్పీలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, సంజీవరావు, రాజేష్, వీరభద్రం, పావని, ప్రథం కోఆర్డినేటర్స్ సుబ్బారావు, రవిచంద్ర, దీక్ష కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాలకు చెందిన డీఆర్పీలు హాజరై శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *