అవయవ దానం… గొప్పకార్యం – లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు కలెక్టర్ సత్కారం – కిమ్స్ వైద్య బృందానికీ ప్రత్యేక అభినందనలు

అవయవ దానం ఎంతో గొప్ప కార్యమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. కొమ్మూరి లక్ష్మయ్య అవయవాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపిన అతని భార్యను, కుటుంబ సభ్యులను శనివారం ప్రకాశం భవనంలోని తన కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు. ప్రకాశం జిల్లాలోనే తొలిసారిగా ఈ అవయవాలను సమర్ధంగా ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా ఆయన అభినందించారు. 

ఒంగోలు నగర శివారులోని ముక్తినూతలపాడు ప్రాంతానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య ( 52) ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంటి పెద్దను కోల్పోయి తీవ్రదుఃఖంలో ఉన్నప్పటికీ ఆ పేద కుటుంబ సభ్యులు పెద్దమనసు చూపారు. లక్ష్మయ్య అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీనితో కిమ్స్ వైద్యులు అతని కాలేయం, కిడ్నీలు, కళ్ళను తీసి ఇతరులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నారు. ఒక కిడ్నీని తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి విజయవంతంగా అమర్చారు. మరో కిడ్నీని గుంటూరు రమేష్ ఆసుపత్రికి, కళ్ళను ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపారు. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్…. లక్ష్మయ్య కుటుంబ సభ్యులైన భార్య నాగదేవి, కుమారుడు షాలోమ్ రాజ వర్ధన్, కూతుళ్లను, అల్లుళ్లను తన చాంబర్ కు పిలిచి సత్కరించారు. లక్ష్మయ్య అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. జీవనదాన్ సర్టిఫికెటును ప్రదానం చేశారు. లక్ష్మయ్య భార్యకు ఒంగోలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. కాగా, లక్ష్మయ్య వైద్య ఖర్చులకు అయిన 70 వేల రూపాయలను ఆ కుటుంబానికి చెక్ రూపంలో కిమ్స్ వైద్యులు తిరిగి ఇచ్చేశారు. లక్ష్మయ్య కుమారుడు ప్రస్తుతం ఐటిఐ రెండవ సంవత్సరం చదువుతున్నాడని, కోర్సు
పూర్తికాగానే తమ వద్దే ఉద్యోగం ఇస్తామని కూడా వైద్యులు తెలిపారు. తమ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లి మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందేలా చూస్తామని వారు ప్రకటించారు. అవయవదానాన్ని ప్రోత్సహించి, దాత కుటుంబానికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా కలెక్టర్ సత్కరించారు.
కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, కిమ్స్ సి.ఓ.ఓ. అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ శ్రీహరి రెడ్డి, వైద్యులు రమేష్ బాబు, రమణారెడ్డి, రామకృష్ణ, జగదీష్, బాల మరళి, అనిల్ కుమార్ ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *