” బెస్ట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్”, “బెస్ట్ చైర్‌పర్సన్” అవార్డులు కైవసం చేసుకున్న “మహారాజా బ్యాంకు”

జాతీయ స్థాయిలో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల వ్యాపార నిర్వహణ, సేవలు, పనితీరు ఆధారంగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక “భారత్ రత్న సహకారిత సమ్మాన్–2026” అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం లక్నోలోని హోటల్ రమడాలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ విభాగంలో వరుసగా మూడోసారి (2023-24, 2024-25, 2025-26) “బెస్ట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్” అవార్డును ‘ది మహారాజా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు’ దక్కించుకోగా, వరుసగా రెండోసారి (2024-25, 2025-26) “బెస్ట్ చైర్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు యం.ఆర్.కె. రాజు కైవసం చేసుకున్నారు. లక్నోలో జరిగిన ఈ వేడుకలో బ్యాంకు జనరల్ మేనేజర్ (ఐ.టీ) ఎం. మురళీకృష్ణ వర్మ, ఐ.టీ అధికారి పి. కిరణ్ కుమార్ రెడ్డి ఈ అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు యం. రామకృష్ణం రాజు (యం.ఆర్.కె. రాజు) మాట్లాడుతూ, బ్యాంకుకు వరుసగా జాతీయ స్థాయి అవార్డులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం 31 మార్చి 2026 నాటికి బ్యాంకు డిపాజిట్లు 29 శాతం (రూ. 84 కోట్లు) పెరిగి రూ. 374 కోట్లకు, రుణాలు 18 శాతం (రూ. 36 కోట్లు) పెరిగి రూ. 238 కోట్లకు చేరుకున్నాయన్నారు. దీనితో బ్యాంకు మొత్తం వ్యాపారం 24.36 శాతం (రూ. 120 కోట్లు) వృద్ధితో రూ. 612 కోట్లకు చేరుకుందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ. 2.34 కోట్ల లాభాన్ని ఆర్జించిందని, బ్యాంకు నికర విలువ రూ. 32.30 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అదనంగా మరో రూ. 7.52 కోట్ల డిపాజిట్లు పెరిగినట్లు ఆయన వెల్లడించారు.
బ్యాంకు విస్తరణలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో నర్సీపట్నం, విజయవాడ, రామచంద్రపురంలలో మూడు కొత్త శాఖలను విజయవంతంగా ప్రారంభించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కొత్త శాఖలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధ్యక్షులు తెలిపారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా అస్సాం స్టేట్ ఎపెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బిశ్వజిత్ పుఖన్, భారత్ నెట్ వర్క్ గ్రూప్ ఫౌండర్ & డైరెక్టర్లు డాక్టర్ అనుపమ్ గుప్తా, డాక్టర్ ఆశిష్ శ్రీవస్తవలతో పాటు దేశంలోని వివిధ బ్యాంకుల చైర్మన్లు, సీఈఓలు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాంకు సాధించిన ఈ ఘనత పట్ల జనరల్ మేనేజర్ యన్. యన్. సత్యనారాయణ మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *