సికింద్రాబాద్, జూన్ 6:(జే ఎస్ డి ఎం న్యూస్)
మారుతున్న సామాజికపరిస్థితుల్లో కుటుంబ బంధాల పరిరక్షణకు,దాంపత్య జీవనంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్,మధ్యవర్తిత్వం ఎంతో కీలకమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, గౌరవం, సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సామరస్యాన్ని పెంపొందించడం, వివాహ బంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(సీడీఈడబ్ల్యూ) – ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం “మీ సురక్ష – కలసి ఉంటే కలదు సుఖం” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు. ఈ వేళుకలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా మనస్పర్థలు వీడి, మళ్లీ ఒక్కటైన 150కి పైగా జంటలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ అమలు చేస్తున్న షీ-టీమ్స్, భరోసా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, షీ షటిల్స్, సీడీఈడబ్ల్యూ కౌన్సెలింగ్ కేంద్రాలు మహిళల రక్షణలో, వారికి న్యాయ సహాయంఅందించడంలో దేశానికే ఆదర్శంగానిలిచాయన్నారు. కౌన్సెలింగ్ ద్వారా విడిపోయిన వందలాదికుటుంబాలను తిరిగి కలపడంలో మల్కాజిగిరి మహిళా భద్రత విభాగం చేసిన కృషిని ఆయన అభినందించారు. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, అవగాహన ఉంటేనే సంతోషకరమైన కుటుంబ జీవితం సాధ్యమవుతుందని, మహిళా భద్రత సిటీ ప్రాజెక్ట్ మరియు ఇతర సేవల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6,700 దంపతులను విజయవంతంగా కలిపినట్లు డీజీపీ వెల్లడించారు. ఈ విజయంలో భాగస్వాములైన కౌన్సెలర్లు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, న్యాయ సహాయక సంస్థల సేవలను ఆయన కొనియాడారు.
తెలంగాణ మహిళా భద్రత విభాగం డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన కుటుంబ బంధాలకు పరస్పర నమ్మకం, గౌరవమే పునాదులని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ వివాదాలను పరిష్కరించడంలో భరోసా, సీడీఈడబ్ల్యూ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దంపతులు ఒకరినొకరు నిందించుకోవడం మాని, పరస్పర దృక్పథాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని, మహిళల విద్య, ఉద్యోగ, వ్యక్తిగత ఆశయాలకు కుటుంబాలు అండగా నిలవాలని సూచించారు. పిల్లలను మంచి విలువలతో పెంచే బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిపై సమానంగా ఉంటుందని ఆమె గుర్తుచేశారు. వివాహ వ్యవస్థ అనేది సర్దుబాటు, అవగాహనపై ఆధారపడి ఉంటుందని, కుటుంబ న్యాయస్థానాల చట్టంలో కౌన్సెలింగ్ అనేది ఒక అంతర్భాగమని తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ అధిపతి ఎస్.ఎన్. శ్రీదేవి స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకున్న జంటలు సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి మాట్లాడుతూ మహిళల సంక్షేమం, సాధికారత కోసం కౌన్సెలింగ్ కేంద్రాలు ఒక సమగ్ర వేదికగా మారాయన్నారు. కమిషనరేట్ పరిధిలోని 8 ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 9,700కు పైగా కేసులు స్వీకరించి, 32 వేలకు పైగా కౌన్సెలింగ్ సెషన్లునిర్వహించామని తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్లతో కలిసి 377 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 16 వేల మందికి పైగా ప్రజలను చైతన్యపరిచామని, ఈ సేవల పట్ల 90 శాతానికి పైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సీపీ వెల్లడించారు. గృహ హింసను తగ్గించి, మహిళలు, చిన్నారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మళ్లీ ఒక్కటైన దంపతులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీడీఈడబ్ల్యూ కేంద్రాలు, కౌన్సెలర్లు, సిబ్బందిని ఘనంగా సత్కరించారు. తాము విడిపోయే దశ నుంచి తిరిగికలుసుకోవడానికి కారణమైన పోలీసు అధికారులకు, కౌన్సెలర్లకు దంపతులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సామరస్యాన్ని కాపాడుకుంటూ శాంతియుతంగా జీవిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ వేడుకలో ఉమెన్ సేఫ్టీ డీసీపీ టి. ఉషారాణి, మై చాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి పెర్ల్ చోరగుడి, సీనియర్ పోలీస్ అధికారులు, కౌన్సెలర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

