తాళ్లూరు మండలంలోని రజానగరం, మల్కాపురం గ్రామాల మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులపై రైతులు సోమవారం ఆందోళనకు చేసారు. దశాబ్దాలుగా పంట పొలాలకు వెళ్లేందుకు ఉ పయోగిస్తున్న దారిని పూర్తిగా మూసివేస్తూ హైవే నిర్మిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నామని, ప్రస్తుతం హైవే నిర్మాణంలో భాగంగా కనీసం బ్రిడ్జి లేదా అండర్పాన్ ఏర్పాటు చేయకుండా రోడ్డు నిర్మిస్తున్నారని రైతులు వాపోయారు. దీంతో పొలాలకు వెళ్లాలంటే చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ ప్రాంతంలో సుమారు 200 నుంచి 300 ఎకరాల మాగాణి భూములు ఉన్నాయని, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేపట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హైవే పనులను తాత్కాలికంగా నిలిపివేసి, రైతుల రాకపోకలకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని
డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

