హైదరాబాద్ జూన్ ,(జె ఎస్ డి ఎం న్యూస్) : నగరంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిటీ పోలీస్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ‘మార్గదర్శక్’ కార్యక్రమానికి అనుబంధంగా, కొత్తగా ‘పోలీస్ మెంటార్స్ ప్రోగ్రామ్’ను తీసుకువస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రకటించారు. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్‌ను మెంటార్‌గా నియమిస్తామని, వారు క్షేత్రస్థాయిలో మార్గదర్శక్ వలంటీర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని ఆయన తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హెచ్సీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన మార్గదర్శక్ శిక్షణ ముగింపుకార్యక్రమంలో సీపీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది వలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేయడంతో పాటు, మార్గదర్శక్ లోగోను ఆవిష్కరించి, రెండో దశ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీసీ సజ్జనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజా భద్రత, మహిళా భద్రత, అత్యవసర సేవలలో భాగస్వాములుగా ఉంటూ, ప్రజలను చైతన్యవంతమైన వలంటీర్లుగా తీర్చిదిద్దడమే మార్గదర్శక్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ అండగా నిలుస్తూ, పోలీసు వ్యవస్థకు ‘ఫోర్స్ మల్టిప్లయర్స్’గా పనిచేసేలా పౌరులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.వలంటీర్లకు ప్రజా భద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, మహిళల భద్రత, సైబర్ అవగాహన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించామని, వీరంతా ఇకపై సేఫ్టీ అంబాసిడర్స్ గా నగర భద్రతలో కీలక పాత్ర పోషిస్తారనివివరించారు.సమాజంలో మహిళలు ఎదుర్కొనే వేధింపులు, పని ప్రదేశాల్లోఇబ్బందులు, గృహ హింస వంటి ఘటనల్లో బాధితులు భయం, అవగాహన లేమితో బయటకు చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నారని, ఇది కాలక్రమేణా పెద్ద నేరాలకు దారితీసే ప్రమాదముందన్నారు. అందుకే, బాధితులకు భరోసా కల్పించేందుకే మార్గదర్శక్ వ్యవస్థను తీసుకువచ్చామని, సమస్యను చూసి తప్పుకునేప్రేక్షకులుగా కాకుండా,సమాజంలో మార్పు తెచ్చే ‘చేంజ్ మేకర్స్’గా ప్రజలు ఎదగాలనిపిలుపునిచ్చారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ పోలీసులకు,బాధితులకు మధ్య మార్గదర్శకులు ఒక నమ్మకమైన వారధిగా పనిచేయాలని, నిబద్ధతతో కూడిన సేవలే పోలీస్ వ్యవస్థకు గౌరవాన్ని తెస్తాయని చెప్పారు. పోలీసింగ్‌లో అయినా, సామాజిక సేవలో అయినా నాణ్యత, క్రమశిక్షణ అత్యంత కీలకమని, వలంటీర్లు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.ఆపదలో ఉన్న మహిళలు తమ ఇబ్బందులను మహిళా సిబ్బంది వద్ద మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పుకోగలరన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, బాధితులకు తక్షణ సాయం, భరోసా అందించేందుకు “స్పందన – ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్” అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ వ్యవస్థ, మార్గదర్శక్, పోలీస్ మెంటార్ల నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తూ మహిళా భద్రతకు ఒక బలమైన రక్షణ కవచంలా మారుతుందని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో రిటైర్డ్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల సేవలను కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. మార్గదర్శకులు మొదటి స్థాయిలో సహాయం అందిస్తే, ఆయా స్టేషన్లలోని పోలీస్ మెంటార్లు వారికి నిరంతర తోడ్పాటును అందిస్తారని, తద్వారా పాఠశాలలు, కళాశాలలు, గేటెడ్ కమ్యూనిటీలు మరియు ఆఫీసుల్లో ఈ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. సురక్షితమైన హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య,హెచ్సీఎస్సీ సెక్రటరీ జనర సి. శేఖర్ రెడ్డి, మహిళా ఫోరం జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఖ్యాతి నారవనే తదితరులు పాల్గొన్నారు.


