హైదరాబాద్, జూన్ 30,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలందించి, వయోపరిమితి కారణంగామంగళవారం పదవీ విరమణ పొందిన 43 మంది పోలీస్ అధికారుల కు ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ తరపున అడిషినల్ సిపి (లా ఆండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పోలీస్ శాఖకు సుమారు 42 సంవత్సరాల పాటు వారు అందించిన అంకితభావ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. సైకిళ్లపై పెట్రోలింగ్ చేసిన నాటి నుండి నేడు ఇన్నోవా కార్లలో పెట్రోలింగ్ చేసే స్థాయి వరకు పోలీస్ శాఖ ప్రస్థానాన్ని చూసిన ఈ అధికారుల కష్టమే తెలంగాణ పోలీసు శాఖకు దేశంలోనే సాటిలేని గుర్తింపు తెచ్చిందని అడిషినల్ సిపి పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత వచ్చే రిటైర్మెంట్ సొమ్ము విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అధిక వడ్డీల ఆశతో మోసపోకుండా ప్రభుత్వ సంస్థలలోనే డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ ఒత్తిడిని తట్టుకుని అధికారులు ఇంత ఫిట్‌గా ఉన్నారంటే కుటుంబ సభ్యుల సపోర్టే కారణమన్న ఆయన, ఇకపై కుటుంబంతో సంతోషంగా గడపాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఖైరతాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ బి. ఆనంద్ మాట్లాడుతూ, రిటైర్మెంట్ అనేది ముగింపు కాదని, 60 ఏళ్ల వయసులో కేఎఫ్‌సీని ప్రారంభించి సాధించిన కల్నల్ సాండర్స్ ఉదాహరణను గుర్తుచేస్తూ తమ ఆసక్తి గల రంగాలలో ముందుకు సాగాలని కోరారు. డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) కె. వెంకటలక్ష్మి మాట్లాడుతూ, నాటి తరం అధికారుల వల్లే నేడు పోలీసింగ్ సులువైందని, అధికారుల వెనుక నిలబడిన కుటుంబ సభ్యుల త్యాగాలకు ఈ రిటైర్మెంట్ ఒక గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరపున అధికారులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో అడిషనల్ డిసిపి బి. ఆనంద్, సిసిఎస్ డిడి ఎసిపి జి. వెంకటేశ్వర రెడ్డి, ఎస్.బి ఎసిపి పి. శివ భాస్కర్ లతో పాటు, ఒకసూపరింటెండెంట్, 12 మంది ఎస్.ఐ లు, 18 మంది ఎ.ఎస్.ఐ/ఆర్.ఎస్.ఐ లు, 5 హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు పిసిలు, ఇద్దరు ఎల్.జి.ఇ లు ఉన్నారు. విధి నిర్వహణ ముగించుకున్న అధికారులను సగర్వంగా వారి నివాసాల వద్ద దింపడానికి ప్రత్యేకంగా ప్రభుత్వ వాహనాలను ఏర్పాటు చేశారు.
ఈ వీడ్కోలు వేడుకలో ఏఏఓ యాదగిరి, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సొసైటీ కార్యదర్శి నల్ల శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ ఖాన్, కోశాధికారి జి.ఎం.ఎస్. విక్టర్, జాయింట్ సెక్రటరీ సి. నవీన్, సభ్యులు ఎం. కేశవ్, కె. రత్నకుమారి, ఎ.ఎస్.డి. శాంతి, డి. లక్ష్మణ్ కుమార్, పి. వినీత్, బి. అప్పల సూరి, డైరెక్టర్లు కె. శ్రీశైలం, కె. జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







