బేగంపేట జూన్ 29,(జే ఎస్ డి ఎం న్యూస్):
మహంకాళి బోనాల జాతరను పార్టీలకు అతీతంగా ఘనంగా జరుపుకుందామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 19 వ తేదీన నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ప్రశంసించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా తమ ప్రభుత్వ హయాంలో చేసిన ఘనమైన ఏర్పాట్లను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోనాల ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు జరగడం లేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారి జాతర సమయం సమీపిస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులకు దక్కన్ మానవ సేవా సమితి సభ్యులు అందించే సేవలు ఎంతో అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రఘుమోహన్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, వర్కింగ్ జనరల్ సెక్రెటరీ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, సభ్యులు కమల్ కుమార్, శ్రీనివాస్, రాజేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


