హైదరాబాద్ జులై 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :
క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ రోబోటిక్ నైపుణ్యాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. నల్లగండ్లలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఎఐఓ), సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంయుక్తంగా అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) సహకారంతో ‘రోబోటిక్ ఇన్నోవేషన్, స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్’ పేరుతో ఆదివారం ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో రోబోటిక్ మరియు మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతులపై సర్జన్లకు మరింత పట్టు సాధించేలా చేసిన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. దాదాపు 250 మందికి పైగా ప్రముఖ సర్జన్లు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని తమ నైపుణ్యాలను పంచుకున్నారు.
ఈ వర్క్‌షాప్‌లో భాగంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సురేష్ చంద్ర హరి, డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ నేతృత్వంలోని రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ బృందం పలు అరుదైన శస్త్రచికిత్సలను లైవ్‌లో చేసి చూపించింది. డాక్టర్ బాల వికాస్ కుమార్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ పి.ప్రజ్ఞా తదితరులు పాల్గొని రోబోటిక్ ఈసోఫేజెక్టమీ, రెక్టల్ క్యాన్సర్, యాంటీరియర్ రిసెక్షన్, సెంటినల్ లింఫ్ నోడ్స్ బయాప్సి, రోబోటిక్ హిస్ట్రెక్టమీ, రోబోటిక్ హెర్నియాప్లాస్టీ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అలాగే థొరాసిక్ కొలరెక్టల్, అప్పర్ జీఐ, గైనకాలజికల్, ఎండోక్రైన్ సర్జరీల్లో అందుబాటులోకి వచ్చిన సరికొత్త రోబోటిక్ విధానాలపై నిపుణులు సుదీర్ఘంగా వివరించారు.
ఒకరి నుంచి ఒకరికి విజ్ఞానం విస్తరించాలనే ఉన్నత ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రోబోటిక్ ఆంకో సర్జన్ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గజగౌని, చీఫ్ జనరల్ ల్యాపరోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ సురేష్ చంద్ర హరి స్పష్టం చేశారు. ఈ వర్క్‌షాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఒక బలమైన రోబోటిక్ సర్జన్ల నెట్‌వర్క్ ఏర్పడుతుందని, దీనివల్ల సామాన్యులకు సైతం అత్యాధునిక క్యాన్సర్ చికిత్స చేరువవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నిపుణుల ప్రసంగాలు, క్లినికల్ కేసుల అధ్యయనం, ప్రాజెక్టు శిక్షణ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు.
రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంలో విజయం సాధించాలంటే కేవలం పరికరాలు ఉంటే సరిపోదని, సరైన శిక్షణ, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం, నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పాలచర్ల అభిప్రాయపడ్డారు. సిటిఎస్ఐ చైర్మన్ దీలీప్ మంగ్సులి మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల రోగులకు స్థానికంగానే ఆధునిక రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్స సేవలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రూపొందించిన క్యాన్సర్ ప్రత్యేక మాసపత్రికను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం వర్క్‌షాప్‌లో పాల్గొన్న వైద్యులను మెడల్స్‌తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ వంగపల్లి, మార్కెటింగ్ హెడ్ కండేపు కిరణ్ కుమార్, ఎఎస్ఐ హానరీ సెక్రటరి డాక్టర్ గడ్డి దివాకర్ మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూధన్, డాక్టర్ పల్లవి, డాక్టర్ కళ్యారసన్ రాజా, డాక్టర్ శ్రవణ రాజమాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

