జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలి – రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఇన్చార్జి మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి

జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఇన్చార్జి మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన అధ్యక్షతన ఉమ్మడి ప్రకాశం జిల్లా డి.ఆర్.సి. సమావేశం ప్రకాశం భవనంలో జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు .పి.రాజాబాబు, విజయ సునీత, ఉమ్మడి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు, కందుకూరు సబ్ కలెక్టర్ డి. హిమ వంశీ, ఇరు జిల్లాల ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ – అనుబంధ శాఖలు, రోడ్డు భవనాలు, నీటిపారుదల రంగాలపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, ప్రస్తావించిన అంశాలను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇరు జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో చెప్పారు.
              మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లాకు పూర్తిస్థాయిలో అధికారులను కేటాయించనందున ప్రస్తుతం ఇరు జిల్లాలకు కలిపి డీ.ఆర్.సీ. సమావేశం పెట్టామన్నారు. తదుపరి సమావేశం ఆయా జిల్లాలలోనే వేరువేరుగా ఉంటుందన్నారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినందున తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. చేపలు పట్టుకునేందుకు చెరువులో నీళ్లు ఇష్టారాజ్యంగా వదిలేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తామన్నారు. హార్టికల్చర్ హబ్ గా మార్కాపురం జిల్లాను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని, రైతులకు అవసరమైన పరికరాలను, స్ప్రింక్లింగ్ లను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. వెలుగొండ ఫలాలను ప్రజలు సత్వరం పొందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయా విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు చెప్పారు. రిజర్వు ఫారెస్ట్ అధికారులు కేంద్రం పరిధిలో ఉన్నాము కదా …. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తే కుదరదని మంత్రి హెచ్చరించారు. అటవీ భూముల పరస్పర మార్పిడి, స్థానిక గిరిజనులకు ఉద్యోగ కల్పనలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని అధికారులకు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
         మంత్రి రవికుమార్ మాట్లాడుతూ చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల్లో ఇలాంటి చర్యల వలన ఆయా చెరువుల్లో నీరు వృధా కావడంతో పాటు సమీప గ్రామాల్లోని భూగర్భ నీటిమట్టం కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీటి పైప్ లైన్ల కోసం రోడ్లను తవ్వుతున్నారని, అనంతరం వాటిని సక్రమంగా పూడ్చకుండా వదిలేయడం వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. పైపులైన్లు వేసే కాంట్రాక్టర్లే తిరిగి రోడ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంటుందన్నారు. సంబంధిత కాంట్రాక్టు లోనే ఈ విషయాలను స్పష్టంగా పొందుపరుస్తున్నందున అధికారులు వాటిని అమలయ్యేలా పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. 2014-19 కాలంలో పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన పనులకు బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సంబంధిత అధికారులు కలెక్టర్ తో చర్చించి బిల్లులను ప్రభుత్వానికి పంపించాలని ఆయన చెప్పారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాలను నివారించేందుకు పెట్రోలింగ్ వాహనాలను సమర్ధంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. మేదరమెట్ల మంచినీటి పథకానికి సంబంధించిన నిర్వాసితులకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినందున అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. జాతీయ రహదారుల్లో నీళ్లు నిలిచిపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. 

            మంత్రి స్వామి మాట్లాడుతూ అటవీ అధికారులు చురుకుగా స్పందిస్తే వారి పరిధిలో లేని భూములు రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తాయని, వీటిని పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ పరిస్థితి తన నియోజకవర్గంలో కూడా ఉందన్నారు. తూర్పు నాయుడుపాలెం సమీపంలోని బాపూజీ కాలనీ వద్ద కూడా జాతీయ రహదారిని దాటేందుకు ప్రజలు సుమారు మూడు కిలోమీటర్లు వెళ్లి తిరిగి రావాల్సి వస్తున్నట్లు చెప్పారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

           ఎంపీ మాట్లాడుతూ సింగరాయకొండలోని జాతీయ రహదారిపై ఉన్న ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దీనితోపాటు జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదికలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

                 ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ అటవీ భూముల విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య యాజమాన్య హక్కులపై స్పష్టత కావాల్సి ఉందన్నారు. కొత్తపట్నం మండలం పల్లెపాలెం అటవీ భూములకు సంబంధించి ఆర్.ఎస్.ఆర్. లో అటవీ భూములుగా ఉందని, అయినా తమవి కావని ఆ శాఖ అధికారులు అంటున్నారని చెప్పారు. ఈ దృష్ట్యా వాటిని రెవెన్యూ భూములుగా బదలాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మేదరమెట్లలోని మంచినీటి పథకం నుంచి అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలకు మంచినీటి సరఫరా జరుగుతున్నందున పైపుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని, అవకాశం ఉంటే డిఎంఎఫ్ నిధులను వినియోగించాలని చెప్పారు.

           గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ రంగనాయక స్వామి ఆలయం వద్ద 60 సెంట్లు రిజర్వు అటవీ భూమి అవసరం ఉన్నదని, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని రిజర్వ్ ఫారెస్ట్ అధికారులకు సూచించారు. ఆ భూమిని కేటాయిస్తే ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజర్వు ఫారెస్ట్ లో వెదురు బొంగుల ఆధారంగా జీవనోపాధి పొందుతున్న స్థానిక గిరిజనులకు ఔట్సోర్స్ విధానం ద్వారా ఉపాధి కల్పించేలా దృష్టి సారించాలన్నారు. బేస్తవారిపేట నుంచి కంభం వరకు జాతీయ రహదారి పైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

            మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం, పొదిలిలో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తినప్పుడు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేసిన వారికి రెండేళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పొదిలి నగర పంచాయతీగా మారక మునుపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటి చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జాతీయ రహదారులపై గ్రామాల్లో లైట్లు లేవని, ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల చిరకాల కోరిక అయిన వెలుగొండ ప్రాజెక్టు ఫలాలు పొందేందుకు సమయం ఆసన్నమైంది అన్నారు. ఈ దిశగా సహకరించిన అధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

              కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు కాలువ మార్గం మీదగా గ్రీన్ ఫీల్డ్ రహదారి వెళ్తూ ఉందని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు డీ.పీ.ఆర్.ను పరిశీలించి సంబంధిత అధికారులు సమన్వయంతో చేయాలన్నారు. లేనిపక్షంలో 100 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి మరోసారి నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

            సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎండ్లూరు చెరువులో ఉన్న చేపలను పట్టుకోవటం కోసం అంటూ నీటిమట్టం తగ్గినప్పటికీ సాగర్ జలాలతో నింపడంలో అధికారులు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై నీళ్లు నిలుస్తున్నాయని, రోడ్ల వెంట డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మార్కాపురం – సంతనూతలపాడు- కొండపి మీదగా రామయ్యపట్నం పోర్టుకు కొత్త రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

              కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో వీఆర్వోలు,  పంచాయతీ కార్యదర్శులు, ఏఈఈల కొరత ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో విలీనమై ఆరు నెలలు గడిచినందిన ఈ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు.

                 ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో సిసి రోడ్ల నిర్మాణం, మంచినీటి బోర్లకు మరమ్మతుల అవసరం ఉందన్నారు. ఎయిమ్స్ కు బస్సు సౌకర్యం కల్పించాలని, మార్కాపురం జిల్లాలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెలుగొండ నుంచి టీ-5 కాలువ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. చిన్న స్పెల్లింగ్ దోషాల వలన వెలుగొండ ప్రాజెక్టు పరిహారం పొందటంలో 1150 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

                 మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బిల్లులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ.నూకసాని బాలాజీ మాట్లాడుతూ పర్యాటక శాఖ తరఫున హోటల్స్ నిర్మించేందుకు మార్కాపురంలో రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. తన సొంత గ్రామమైన బింగినపల్లిలో కూడా చేపలను పట్టుకునేందుకు చెరువులోని నీటిని వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక మిషన్ చైర్మన్ శ్రీమతి పొడపాటి తేజస్వి మాట్లాడుతూ ఒంగోలులో డాన్స్,  మ్యూజిక్ అకాడమీ నిర్మించేందుకు ఫీజిబిలిటీ రిపోర్టును త్వరగా ప్రభుత్వానికి పంపించాలని కోరారు.

                  ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లో మహిళలపై నేరాలు 23 శాతం తగ్గాయి అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేయకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు, వాటి వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు విస్తృతం చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 220 కుంభాకార దర్పణాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
           ఈ సమావేశంలో పిడిసిసి బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయకుమార్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సునీత, దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *