ఆగిపోనున్న పార్థివ వాహన సేవలు?బకాయిలు చెల్లించని ప్రభుత్వం!

హైదరాబాద్ ఆగస్టు 17
,(జే ఎస్ డి ఎం న్యూస్)
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు మరణిస్తే వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇదే అవకాశంగా భావించి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతుండటంతో, నాటి ప్రభుత్వం 2016 నవంబర్‌లో ఉచిత పార్థివ వాహన సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీటి నిర్వహణ బాధ్యతలను జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థకు అప్పగించింది. నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్న ఈ సేవలు ఇప్పుడు బంద్ అయ్యే ప్రమాదంలో పడ్డాయి.
గత రెండేళ్లుగా నిర్వహణ సంస్థకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. నిధుల కొరత వల్ల వాహనాల నిర్వహణ ఖర్చులు, డీజిల్ ఛార్జీలతో పాటు పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించడం తీవ్ర భారంగా మారింది. ఈ వాహనాల్లో పనిచేసే ఉద్యోగులు సైతం పేద కుటుంబాలకు చెందినవారే కాగా, వారి జీతాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల విడుదలపై నిర్వాహకులు పలుమార్లు విన్నవించినా సర్కారు స్పందించకపోవడంతో సేవలు నిలిచిపోయే స్థాయికి చేరుకున్నాయి.
పార్థివ వాహనాలే కాకుండా 108, 102 అత్యవసర సేవల నిర్వహణకు కూడా బకాయిలు విడుదల కాకపోవడంతో భవిష్యత్తులో ఈ సేవలు కూడా ఆగిపోయే ముప్పు ఉందని అధికారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులను విడుదల చేయాలని, పేదలకు ఎంతో అవసరమైన ఈ ఉచిత సేవలు ఆటంకం లేకుండా కొనసాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *