హైదరాబాద్ సెప్టెంబర్ 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ నోట్లు ముద్రిస్తూ చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చూసి దొంగనోట్ల దందాకు తెరలేపిన ముగ్గురు నిందితులను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,91,100 విలువైన నకిలీ కరెన్సీతో పాటు అత్యాధునిక ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వడ్డిపట్ల పరిధిలోని చింతల్ తండాకు చెందిన రామావత్ రాము అలియాస్ మహమ్మద్ (36) జొమాటో డెలివరీ బాయ్‌గా, రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య దూరంగా ఉండడం, వచ్చే సంపాదన సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తన బంధువైన రాపిడో డ్రైవర్ రామావత్ మోతీలాల్ (35)తో కలిసి యూట్యూబ్‌లో నకిలీ నోట్ల తయారీ విధానాన్ని శోధించాడు. యూట్యూబ్‌లో లభించిన ఓ కాంటాక్ట్ నంబర్ ద్వారా ఫేక్ కరెన్సీ తయారీకి అవసరమైన ముడిసరుకు, పరికరాల వివరాలను సేకరించారు. అనంతరం తన మేనల్లుడైన ఆటో డ్రైవర్ రామావత్ గాంధీ (19)ని కూడా ఈ దందాలోకి లాగారు.
నిందితులు ఎప్సన్ కలర్ ప్రింటర్, కలర్ ఇమేజ్ స్కానర్, జెబ్రోనిక్స్ లామినేటర్, ప్రత్యేక లిక్విడ్ కలర్స్, వాటర్‌మార్క్ బాండ్ పేపర్లు తదితర సామగ్రిని సమకూర్చుకున్నారు. అసలు నోట్లను పోలిన విధంగా జిరాక్స్ తీసి వాటర్‌మార్క్‌లతో రూ.500, రూ.200, రూ.100 విలువైన నకిలీ నోట్లను తయారు చేశారు. రద్దీగా ఉండే రాత్రి వేళల్లో వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లలో చిన్నచిన్న మొత్తాల్లో వీటిని చెలామణి చేయడం ప్రారంభించారు.
పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్, బాలాపూర్ పోలీసులు నిందితుల స్థావరంపై దాడి చేసి రాము, మోతీలాల్, గాంధీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 437 ఐదువందల నోట్లు, 648 వంద నోట్లు, 39 రెండువందల నోట్లతో పాటు చిల్డ్రన్ బ్యాంక్ నకిలీ నోట్ల బండిల్స్, జిరాక్స్ కోసం వాడిన అసలు నోట్లు, కలర్ ప్రింటర్, స్కానర్, లామినేటర్, పేపర్ కట్టర్, బాండ్ పేపర్లు, మూడు స్మార్ట్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని (TG 07 BE 9434) స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నాగోల్ బండ్లగూడకు చెందిన సుధీర్ జాన్ చేలా అలియాస్ వంశీ పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రాముపై గతంలో నల్గొండ ఉమెన్ పీఎస్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదై ఉంది.
నిందితులను, రికవరీ చేసిన సొత్తును తదుపరి విచారణ నిమిత్తం బాలాపూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి. కృష్ణమోహన్, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐ కె. మన్సూర్ అలీ, వారి సిబ్బందిని అడిషనల్ డీసీపీ కేఎస్ రావు ప్రత్యేకంగా అభినందించారు.
నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు – రూ.2.91 లక్షల ఫేక్ కరెన్సీ సీజ్, ముగ్గురు అరెస్ట్
02
Sep