వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, నియమ నిబంధనలకు లోబడి,ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి – ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు – గణేష్ ఉత్సవాల అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా పొందాలి – జిల్లా ఎస్పీ

వినాయక చవితి పర్వదినం, ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ అధికారులకు పలు సూచనలు తెలియచేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసిన మండపాలతో పాటు ఇతర ప్రదేశాల్లోనూ భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

నిమజ్జనం జరిగే ప్రదేశాలు, సంబంధిత ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం, గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక పరికరాలు తదితర ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

సెప్టెంబర్ 14వ తేదీ నుంచి నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్/పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అనుమతులను సులభంగా ఒకే వేదిక ద్వారా పొందేందుకు https://ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ సేవ పూర్తిగా ఉచితమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

ఆన్‌లైన్‌లోనే అనుమతులు…

ప్రజలు https://ganeshutsav.net అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేసి దరఖాస్తును, ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకునే విధానం …

గణేష్ ఉత్సవాల నిర్వహణకు మొదటగా దరఖాస్తు చేయదలచిన వారు https://ganeshutsav.net వెబ్ సైట్ ఓపెన్ చేసి న్యూ అఫ్లికేషన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

తరువాత దరఖాస్తు దారుని మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయవలయును. తరువాత సదరు మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయవలయును.

ఆ తరువాత దరఖాస్తు దారుని పేరు, అడ్రస్ మరియు కమిటి సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయవలయును.

అప్లికేషన్ ఐడి నెం. (యూనిక్ ఐడి ) జనరేట్ చేయబడి, సదరు దరఖాస్తు పోలీస్ శాఖ యొక్క అనుమతి కోసం వారి లాగిన్స్ కు వెళుతుంది. అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అనుమతించిన తరువాత ఆ వివరాలు వెబ్ సైట్ నందు వచ్చును. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. అనుమతికి సంభందించిన క్యూ ఆర్ కోడ్ కలిగిన నిరభ్యంతర పత్రాన్ని జారీ (NOC) చేస్తారు. ఈ పత్రాన్ని ప్రింట్ చేసి గణేష్ మంటపంలో ఉంచాలి.

గణేష్ ఉత్సవాలు నిర్వహించే కమిటీ నిర్వాహకులు ganeshutsav.net వెబ్సైట్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేశులను మాత్రమే ప్రతిష్ఠించాలి.

వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు:

👉గణేష్”విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా ఒక కమిటీని ఏర్పాటుచేసి, ఆ కమిటీదే అన్ని బాధ్యతలని స్పష్టంగా గుర్తించాలి.

👉పంచాయతీ/మున్సిపాలిటీ/ నగర పాలక సంస్థ లేదా ప్రయివేట్ స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగపు అధికారుల అనుమతి తప్పనిసరి.

👉ఫైర్, విద్యుత్ శాఖల విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు/మంటపాలు వద్ద అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా నివారించడానికి మంటపంలో తగినంత ఇసుక, నీళ్ళ మరియు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు (అగ్ని మాపక పరికరాలు) ఉండాలి.

👉పందిళ్లు లేదా మండపాలలో అగ్నిప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్‌ జరగకుండా, వైరింగ్‌ను నిపుణుల ద్వారా సురక్షితంగా చేయించుకోవాలి.

👉 వినాయక చవితి మండపాల వద్ద అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే స్పీకర్లు వినియోగించకూడదు. స్పీకర్లు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకే వినియోగించాలి.

👉మైకు లో ఎవరైనా కించపరిచే విధంగా వాక్యాలు చేయటం గాని, రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రచారం చేయరాదు.

👉 విద్యాసంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాలు/చర్చిలు/మసీదులు (ప్రత్యేక స్థలాల వద్ద), పోలీస్ స్టేషన్లు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మైక్‌ ద్వారా ఎటువంటి ప్రచారమూ చేయరాదు.

👉 రాత్రి వేళలలో మండపాల వద్ద నిర్వహణ కమిటీ ప్రతినిధులు విధిగా కాపలా ఉండాలి. భద్రతా దృష్టితో, ప్రతి మండపం తమకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. రాత్రి సమయాలలో పందిళ్లు/మంటపాలలో విలువైన వస్తువులు ఉంచకూడదు.

👉ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశంలో కమిటీ సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. భద్రతా పరిరక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

👉వినాయక పందిళ్లు లేదా విగ్రహాలను రోడ్డుపైన ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు లేదా ప్లెక్సీలు రాకపోకలకు అంతరాయంగా రోడ్లపై ఉంచకూడదు. వినాయక చవితి ఉత్సవాల సమయంలో బాణసంచా వాడకూడదు.
పందిళ్ల వద్ద మరియు ఊరేగింపు సమయంలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నృత్యాలు జరగకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు బాధ్యత వహించాలి.

👉ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్ధము వచ్చే వాయిద్యాలు అనగా డి.జే., తదితరాలకు అనుమతి ఉండదు.

👉 నిమజ్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమజ్జనకు కేటాయించిన ప్రదేశం, అలాగే ఊరేగింపుకు కేటాయించిన మార్గాలలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.

సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు…

సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, నిర్ధారణ లేని వార్తలు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దని, వాటిని ఫార్వర్డ్ చేయవద్దని ఎస్పీ సూచించారు.

ఏదైనా అనుమానం లేదా సమస్యలు ఉంటే స్ధానిక పోలీసులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు.

జిల్లా ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు,యువత, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు

ఎక్కడైనా సమస్యలుంటే అత్యవసర పరిస్థితుల్లో డయల్–112 లేదా police whatsapp Number 9121102266 కు లేదా స్థానిక పోలీసులను గాని సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *