బేగంపేట సెప్టెంబర్ 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాకు చెందిన అనీష్ భార్య అతిర అనీష్ (24) గత రెండేళ్లుగా మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ ప్యారడైజ్ వద్ద ఉన్న కిమ్స్ హాస్టల్‌లో ఉంటోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను పరామర్శించేందుకు ఈనెల 1వ తేదీన కేరళ నుంచి తల్లి అనిత, తండ్రి కమలాధరన్ నగరానికి వచ్చారు.
ఆ రోజు మధ్యాహ్నం హాస్టల్ వద్ద తల్లిదండ్రులు, కూతురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలోకి వెళ్తానని చెప్పిన అతిర అటునుంచి అటే కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్‌గా రావడంతో ఆందోళనకు గురై పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గాయత్రీ దేవి మిస్సింగ్ కేసు నమోదు చేశారు.బయటకు వెళ్లిన సమయంలో ఆమె నలుపు రంగు షర్ట్, తెల్లటి జీన్స్ ధరించి ఉందని పోలీసులు తెలిపారు. సుమారు 5.2 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, గుండ్రటి ముఖం కలిగి ఉంటుందని, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలదని పేర్కొన్నారు. ఎస్ఐ జె. రెడ్డి నాయక్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు
రాంగోపాల్‌పేట్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
