19వ తేదీన నిర్వహించే ‘ మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ‘ లో భాగంగా శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్ళు అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమం ‘ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘ లో నిలిచేలా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో బుధవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలో 80 వేలకు పైగా ఇళ్ళు ఉన్నాయని, తడి చెత్తను, పొడి చెత్తను ఇంటి వద్దే వేరువేరుగా వేసేలా ప్రతి ఇంటికీ ప్రత్యేక నంబర్లతో కూడిన 2 బయోడీగ్రేడబుల్ కవర్లను మున్సిపల్ అధికారులు గురువారం సరఫరా చేస్తారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయాల్సిన ఆవశ్యకతను, ఈ ‘ మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ‘ లక్ష్యాలను, ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల వివరాలతో కూడిన కరపత్రాలను కూడా అందిస్తారు. శనివారం ఉదయం మున్సిపాలిటీ వ్యాప్తంగా ఒక గంట పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందికి సహాయం చేసేలా మెప్మా సభ్యులను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఒంగోలు పారిశుధ్య కార్మికులకు అదనంగా సమీప మండలాలలోని పంచాయతీ కార్మికులను కూడా ఈ విధులకు ప్రత్యేకంగా తరలించాలని చెప్పారు. సేకరించిన చెత్తను రవాణా చేసేందుకు అవసరమైన వాహనాల మోహరింపు, వాటికి నిర్దిష్ట సిబ్బంది కేటాయింపు, శానిటేషన్ డివిజన్ల వారీగా ఈ డ్రైవ్ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి అధికారులను కూడా కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూడాలన్నారు. ఇందుకోసం శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించాలన్నారు. ఆయా విషయాలను తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లేలా అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కూడా గురువారం అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు.
ఈ సమావేశంలో డ్రైవ్ పర్యవేక్షకులుగా ఉన్న ఐదుగురు జిల్లాస్థాయి అధికారులైన జడ్పీ సీఈవో చిరంజీవి, మెప్మా పిడి నారాయణ, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డ్వామా పిడి జోసఫ్ కుమార్, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ తోపాటు డీఈవో రేణుక , ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

