దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలని యుటిఎఫ్ ఉపాధ్యాయ నాయకురాలు ఆర్ ఎల్ రాగ శ్రవంతి పిలుపునిచ్చారు. దర్శి లో గీతాంజలి కాలేజీ నందు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 119 వ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ వెలుగోటి సుధాకర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి యువ సమరయోధులు చూపిన ధైర్యం, త్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన పోరాటాన్ని, త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరువకూడదన్నారు. భగత్‌సింగ్ కేవలం బ్రిటిష్ పాలన నుంచి రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, దోపిడీ లేని సమాజం కోసం కలలు కన్నారని తెలిపారు.యువతలో శాస్త్రీయ ఆలోచన, సామాజిక చైతన్యం, ప్రశ్నించే తత్వం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి తదితరులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో సాగించిన పోరాటాలను వారు గుర్తుచేశారు.వారి త్యాగం, దేశం పట్ల అంకితభావం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువత విద్య, ఉపాధి, సామాజిక బాధ్యతలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, ఉపాధి తదితర సమస్యలపై డివైఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తాండవ రంగారావు తెలిపారు.
భగత్‌సింగ్ ఆశయాలు యువతకు మార్గదర్శకం కావాలని, ఆయన కలలు కన్న సమానత్వ సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం యువకుల చేత ప్రతిజ్ఞ చేయించారు . కార్యక్రమంలో డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె వి పిచ్చయ్య. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తాండవ రంగారావు. డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు ఆర్ జెస్సి పాల్. షేక్ పిరా సాహెబ్. యువతీ యువకులు పాల్గొన్నారు.


