రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి పర్యవేక్షణలో ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధనా సంస్థకు చెందిన ఏడుగురు సభ్యుల బృందం జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది.
మొదట కందులూరు గ్రామంలో రైతు కాట్రగడ్డ లక్ష్మి సాగు చేస్తున్న కంది ఏ-గ్రేడ్ నమూనా క్షేత్రాన్ని పరిశీలించి, నవధాన్యాల సాగు, విత్తన గుళికల వినియోగం, దోస అంతర పంట సాగు ద్వారా పొందుతున్న అదనపు ఆదాయం గురించి తెలుసుకున్నారు. అనంతరం రైతు దాసయ్య గారి మామిడి తోటను సందర్శించి, అంతర పంటల సాగు విధానాలు, పంటల నిర్వహణ, ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తదుపరి కొత్తపట్నం గ్రామంలోని అంకమ్మతల్లి జీవ వనరుల కేంద్రాన్ని సందర్శించిన బృందానికి, కేంద్రం సభ్యులు కషాయాలు, ద్రావణాల తయారీ విధానాన్ని ప్రదర్శించి వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయంలోని తొమ్మిది సార్వత్రిక సూత్రాలను వివరించి, వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.
అనంతరం రైతులు రామలింగం, జ్యోతి, కాటా సురేంద్ర సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించి, రసాయన వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి మధ్య ఉన్న తేడాలు, సాగు పద్ధతులు, రైతుల అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.
మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మహిళా సంఘ సభ్యులతో బృందం నేరుగా మాట్లాడి తెలుసుకుంది. ఆరోగ్యం, పోషకాహార విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి వారు పొందుతున్న ప్రయోజనాలు, వినియోగిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వివరాలను సేకరించింది.
ఈ కార్యక్రమంలో పరిశోధనా సంస్థ బృంద సభ్యులు, రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయ ప్రతినిధులు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: