సికింద్రాబాద్, అక్టోబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్ )
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026ను పురస్కరించుకుని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సదరన్ రీజియన్-1 (SR-1) ఆధ్వర్యంలో గురువారం నెక్లెస్ రోడ్డులో వాక్‌థాన్‌ను నిర్వహించారు. సమాజంలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువల ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ ర్యాలీని పవర్‌గ్రిడ్ ఎస్ఆర్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.
విజిలెన్స్ సందేశాలతో కూడిన మువ్వన్నెల గొడుగులను చేతబూని అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా అడుగులు వేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వినూత్న ప్రదర్శన ఉద్యోగుల ఐక్యతతో పాటు నైతిక విలువలకు కట్టుబడి ఉంటామనే సంకల్పాన్ని చాటిచెప్పింది.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్ మాట్లాడుతూ, ‘సమృద్ధికి సత్యనిష్ఠ (Probity for Prosperity)’ అనే మూలసూత్రాన్ని ప్రతి ఒక్కరూఅలవర్చుకోవాలనిపిలుపునిచ్చారు. సంస్థాగత ప్రగతికి, ప్రజా విశ్వాసాన్ని చూరగొనడానికి అవినీతి రహిత, పారదర్శక వాతావరణం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విధి నిర్వహణలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ప్రతి ఉద్యోగి అత్యున్నత నైతిక ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: