హైదరాబాద్ నవంబర్ 17,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) : ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాల ఫీజు రూ.35 వేలు చెల్లించి,విద్యా సర్టిఫికెట్లు పొందలేక ఉన్నత విద్యకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థి కందుకూరి యోగేశ్వర్ గుప్తాకు సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి చేయూతనిచ్చారు.
ఆ విద్యార్థి సర్టిఫికెట్స్ ను స్కూల్ నుంచి పొందడానికి అవసరమైన ఫీజు రూ. 35 వేలు ఇన్నర్ వీల్ బంజారా సంస్థ ద్వారా ఏర్పాటు చేసి మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో చెక్ ను గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు.ఫీజు బకాయి ఉందనే కారణంతో విద్యార్థికి టెన్త్ క్లాస్ మెమోతో పాటు ఇతర విద్యా సంబంధిత సర్టిఫికెట్లను అందించేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థి సమస్యను సీఎం ప్రజావాణి స్టేట్ ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికితీసుకువచ్చారు.విద్యార్థి విద్యా భవిష్యత్తుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో గద్వాల్ విజయలక్ష్మి మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు అవసరమైన రూ.35 వేల మొత్తాన్ని ఇన్నర్ వీల్ బంజారా సంస్థ అధ్యక్షులు అంజలి బన్సాల్, ఉపాధ్యక్షులు రష్మీ దోషి, కార్యదర్శి అమీతా కర్నాని ద్వారా సమకూర్చి విద్యార్థికి అండగా నిలిచారు.ఈ మొత్తాన్ని పాఠశాల ఫీజు కింద చెల్లించడంతో స్కూల్
యాజమాన్యం విద్యార్థి యోగేశ్వర్ గుప్తాకు సంబంధించిన పదో తరగతి మెమోతో పాటు ఇతర విద్యా సర్టిఫికెట్లను అందజేసింది. సీఎం ప్రజావాణిలో గద్వాల్ విజయలక్ష్మి స్వయంగా విద్యార్థికి ఆ సర్టిఫికెట్లను అందించారు.విద్యార్థుల భవిష్యత్తు ఆర్థిక పరిస్థితుల కారణంగా అంధకారంలో పడకూడదని, అవసరమైన సమయంలో సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద విద్యార్థులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా గద్వాల్ విజయలక్ష్మి ఆకాంక్షించారు.సీఎం ప్రజావాణి ద్వారా సమస్యకు పరిష్కారం లభించడంతో విద్యార్థి యోగేశ్వర్ గుప్తా, అతని కుటుంబ సభ్యులు గద్వాల్
విజయలక్ష్మికి, ఆర్థిక సహాయం అందించిన ఇన్నర్ వీల్ బంజారా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: