హైదరాబాద్ నవంబర్ 25,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ – Artificial Intelligence) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట ఠాణారూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్ లు బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ కొనసాగుతున్న సాంకేతిక పనులను క్షుణ్ణంగాపరిశీలించారు. పైలట్ ప్రాజెక్టు కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని అన్ని రకాల పోలీసింగ్ సేవలను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానించనున్నారు.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, ఏఐ వ్యవస్థ ద్వారా వారి సమస్యలను సిబ్బంది ఏ విధంగా స్వీకరించి పరిష్కరిస్తున్నారో అడిగితెలుసుకున్నారు. అనంతరం ఠాణాలోని ప్రతి ఒక్క సిబ్బంది పనితీరును, ఏఐ సాంకేతికత సహాయంతో వారు విధులను ఏ విధంగా నిర్వహిస్తున్నారో స్వయంగా పర్యవేక్షించారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ, ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్‌లతో కలిసి స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సాంకేతిక మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌ను పైలట్ ప్రాజెక్టుగా త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.ఈ తనిఖీ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ
(లా అండ్ ఆర్డర్) అకున్ సభర్వాల్, హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) ఎం. శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, టీఎస్‌పార్క్ (TSPARK) ఎస్పీ రూపేశ్, డీసీపీ (స్మిత్) అరవింద్ బాబు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: