బేగంపేట నవంబర్ 27,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలను (CSAM) షేర్ చేసిన గుర్తుతెలియని వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన సైబర్ టిప్‌లైన్ నివేదిక ఆధారంగా మల్కాజిగిరి సైబర్ క్రైమ్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా lyrics._dil_se_dil_tek (Bad boy) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ అభ్యంతరకర కంటెంట్ షేర్ అయినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడి లొకేషన్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై బేగంపేట ఎస్సై సి. రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత సున్నితమైన ఈ అంశంపై నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: