హైదరాబాద్ నవంబర్ 27,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అత్యంతఉత్సాహంగా కొనసాగిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర శుక్రవారం జూబ్లీహిల్స్లో దిగ్విజయంగా ముగిసింది.నగర వ్యాప్తంగా సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ మహా యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.అడుగడుగునా జననీరాజనం లభించింది.
గత మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా సాగిన ఈ పాదయాత్రలో యువత, మహిళలు, విద్యార్థులు అడుగడుగునా కిషన్ రెడ్డి తో మమేకమై కలిసి నడిచారు. ముఖ్యంగా 220 పాఠశాలలు, 52 జూనియర్ కళాశాలలు, 30 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సుమారు 43,000 మంది విద్యార్థులు తరలివచ్చి డ్రగ్స్ మహమ్మారిపై తమ గళాన్ని వినిపించారు.సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాల మద్దతు లభించింది.
ఈ మహత్తర యాత్రకు వివిధ రంగాల ప్రముఖులు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, విలక్షణ నటుడుసాయికుమార్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తదితర సినీ ప్రముఖులు యాత్రలో పాల్గొని యువతలో కొత్త జోష్ నింపారు.అలాగే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు సహా వేలాది మంది కార్యకర్తలు ఈ మూడు రోజుల యాత్రలో కదం తొక్కారు.40 కిలోమీటర్ల పాటు అలుపెరగకుండా సాగిన ఈ పాదయాత్ర జూబ్లీహిల్స్ చేరుకోవడంతో, మత్తుపదార్థాల రహిత హైదరాబాద్ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామనే బలమైన సందేశాన్ని సమాజానికి అందించింది.






Save or share this story as a newspaper-style Epaper Clip: