ఉన్నత చదువులకు పేదరికం అడ్డురాకుండా ప్రతి బిడ్డా ఉన్నత విద్యావంతులు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు. జగనన్న విద్యా దీవెన పధకంలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరంలో మూడో విడత నిధులను అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో సోమవారం జమ చేస్తున్న సందర్భంగా చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. లబ్ధిదారులైన విద్యార్థులకు ఈ మేరకు బ్యాంకు చెక్కును వారు అందించారు.
ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ…. మూడో విడతలో 47,350 మంది అర్హులైన విద్యార్థులకు రూ.35,39,96,419 ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. ఈ మేరకు వీరికి చెందిన 42,899 మంది తల్లుల ఖాతాలలో ఈ నిధులను నేరుగా జమ చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారు లైన విద్యార్థులలో ఎస్.సి.లు 12,537, ఎస్.టి.లు 1,258, బి.సి.లు 15,860, ఈ.బి.సి.లు 11,800, ముస్లీం మైనార్టీలు 3,086, కాపులు 2,756, క్రైస్తవ మైనార్టీలు 53 మంది ఉన్నట్లు వివరించారు. ఏ.. త్రైమాసికానికి ఆ ..త్రైమాసికం ముగిసిన వెంటనే ఈ పధకం క్రింద కాలేజీ ఫీజులను రీయింబర్స్ చేస్తున్నట్లు తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఈ మూడు విడతలలో కలిపి రూ.107,57,86,721 లు విడుదల అయినట్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని వినియోగించుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని, కుటుంబానికీ, సమాజానికీ బాసటగా ఉండేలా ఉత్తమ పౌరులుగా ఉండాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.
కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ ….
విద్య, వైద్య రంగాలకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ఆయన కొనియాడారు.
ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బి.సి. సంక్షేమ అధికారి అంజలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


