సి.సి.ఆర్.సి. కార్డులు పొందిన కౌలు రైతులు, అటవీ భూములు, దేవాదాయ భూములను సాగు చేసుకునే కౌలు రైతులకు కూడా వై.ఎస్.ఆర్.రైతు భరోసా అందించడం శుభపరిణామమని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు.
వై.ఎస్.ఆర్.రైతు భరోసా పథకంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నగదు జమ చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ప్రకాశం భవనం నుంచి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ తో పాటు జిల్లా వ్యవసాయ సలహా ఈ మండలి ఛైర్మన్ ఆళ్ల రవీంద్రా రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం లబ్దిదారులైన రైతులకు బ్యాంకు చెక్కును అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ…. ప్రకాశం జిల్లాలో 5,802 మంది కౌలు రైతుల ఖాతాలలో రూ.4.35 కోట్ల నగదును జమ చేసినట్లు చెప్పారు. 2023 మే నుంచి ఆగస్ట్ వరకు సంభవించిన అకాల వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 47 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సహాయం కూడా నేడు వారి ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్క రైతు పంటలు వేయాలన్నారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ… అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో లో నష్టం పరిహారం ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రెతులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించనంత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందించినట్లు ఆయన కొనియాడారు.
ఒంగోలు నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రైతుల సంక్షేమం కోసం అన్ని రకాలుగా ఆర్థిక సహాయాన్ని అందించిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా సహాయాన్ని అందించడం గొప్ప విషయమని ఆమె చెప్పారు.
కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి గోపీచంద్, తదితర అధికారులు పాల్గొన్నారు.


