స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాలులో “డయల్ యువర్ కలెక్టర్”, “స్పందన” కార్యక్రమాలలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ… స్పందన అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని స్పష్టం చేశారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని ఆయన చెప్పారు. ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్నారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు క్లుప్తంగా వివరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ముందుగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె. శ్రీనివాసులు ప్రజలు ఫోన్లో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. వీటిపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడారు.
- పొదిలి మండలం పొదిలి నుంచి సి.హెచ్. అనుపమ ఫోన్ చేశారు. తమ పరిధిలో ఉన్న బోర్ చెడిపోయిందని, కానీ ఇప్పటి వరకు రిపేరు చేయలేదని, సాగర్ నీరు కూడా రావడం లేదని ఇన్ఛార్జి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి కలెక్టరు స్పందిస్తూ ..ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
- కొమరోలు మండలం రెడ్డి చెర్ల గ్రామం నుంచి ఎస్.పుల్లయ్య ఫోన్ చేశారు. రెడ్డి చెర్ల పంచాయతీ సెక్రటరీ దృష్టికి స్థానిక సమస్యలను తీసుకువెళ్లినా సరిగా స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇన్ఛార్జి కలెక్టరు స్పందిస్తూ ఈ విషయంపై సమగ్ర విచారణ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
- మర్రిపూడి మండలం అయ్యపురాజుపాలెం గ్రామం నుంచి కె.మాధవరావు ఫోన్ చేశారు. తమ గ్రామంలో సి.పి. డబ్ల్యు.ఎస్. పధకం ద్వారా త్రాగు నీటి సరఫరా సరిగా లేదని ఫిర్యాదు చేశారు. ఇన్ఛార్జి కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డి.ఆర్.ఓ. శ్రీమతి కె. శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, లోకేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.


