ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగింపుపై చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 6 లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా తయారీపై సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..జాబితా తయారీలో లోపాలు ఉన్నాయంటూ రాజకీయ పార్టీల ప్రతినిధులు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఈ నెల 11 లోగా నివేదిక పంపించాలని ఆదేశించారు. ఈ.వి.ఎం.ల నిర్వహణపై ఈ నెలాఖరులోగా వర్క్ షాపు నిర్వహించనున్నందున కలెక్టర్లతో పాటు ఎఫ్.ఎల్.సి. అధికారులను కూడా త్వరగా ఖరారు చేయాలని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఇంటింటి సర్వే పెండింగ్ వెరిఫికేషన్ కూడా ఈ నెల 10 లోగా పూర్తి చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. గతంలో పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు పనులు జరుగుతున్నందున ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాలను గుర్తించాల్సిన పరిస్థితి నెలకొంటే ఆ వివరాలను కూడా ఈ నెల 15 నాటికి తమకు పంపాలని ఆదేశించారు. ఇప్పటి వరకు వచ్చిన క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలను ఈ నెల 20 నాటికి పరిష్కరించి ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రాలకు చేరే ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (ఎపిక్) ను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత ఓటర్లకు త్వరగా చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.
ఈ వీడియోకాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి ఇన్ ఛార్జ్ కలెక్టర్ కె. శ్రీనివాసులు, డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, ట్రైనీ కలెక్టర్ శౌర్య మన్ పటేల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

