తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు సోమవారం జరిగిన బందు విజయవంతం అయింది. ఈ కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, టిడిపి మండల మాజీ అధ్యక్షులు సోమపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోపన బోయిన శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగింది. మండలంలోని టిడిపి ప్రధాన నాయకులను గ్రామాల్లో ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. పలు గ్రామాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ముండ్లమూరుకు చేరుకున్నారు. అద్దంకి దర్శి రహదారిలో బస్టాండ్ సెంటర్లో గల మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకమరావు విగ్రహం వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిచి పోవడంతో సమాచారం తెలుసుకున్న ఎస్సై యు వి కృష్ణయ్య తన సిబ్బందితో నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. నిరసన సందర్భంగా అద్దంకి దర్శి వెళ్లే మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ విడిచిపోయాయి. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థ అయిన పినాకిని గ్రామీణ బ్యాంకును మూసి వేయించారు .పోలీసులు తీసుకెళ్లిన వారిలో టిడిపి ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వరగాని పౌలు, మాజీ ఎంపీపీ కోడిగం మస్తాన్, శంకరాపురం సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, తాతపూడి తెల్లయ్య, మేదరమెట్ల రాంబాబు, కుంటా నాగేశ్వరరావు, గుద్దేటి నారాయణరెడ్డి, వాకా బ్రహ్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ సుంకర రాఘవరెడ్డి, పసుపుగల్లు మాజీ సర్పంచ్ ఇందూరి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




