దక్షిణకోస్తా జిల్లాల వైసిపి కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సోమవారం జిల్లా నేతలతో వాడివేడిగా భేటీలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలను తేల్చేందుకు ఆయన జిల్లాకు వచ్చారు. ఒక్కొక్కరితో ముఖ్యనేతలందరితోనూ భేటీలు జరిపారు. ఎవరితో ఏం మాట్లాడిందీ ఇంకొకరికి తెలియకుండా ఈ భేటీలు జరిగాయి. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరి పరిస్థితి ఏమిటనే దానిపై చర్చలు సాగుతున్నాయి. ఈ భేటీల్లో ఆయన నేతల భవిష్యత్ చిట్టాలను వారి ముందుంచారని వినికిడి. ఇప్పటికే ఐప్యాక్ తోపాటు పార్టీలు వివిధ కోణాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగా వారికి ఓ క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎవరికి టిక్కెట్టు వస్తుంది? ఎవరికి రాదనేదీ ఈ భేటీల్లోనే తేటతెల్లమైనట్లు సమాచారం. నియోజకవర్గంలో మీరు పలానా వెనుకబడ్డారు? పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రజలలో ఎలాంటి అభిప్రాయం ఉందనేదీ వారిముందుంచారని సమాచారం. గడప గడపకూ కార్యక్రమం చేపట్టిన విషయాల్లో అనంతరం గ్రామాల్లో ప్రజల్లోనూ, ద్వితీయశ్రేణి నేతల్లోనూ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనేది ఇక్కడ
చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలనాటికి పని తీరు మార్చుకుని ముందుకు పోతేనే టిక్కెట్లు దక్కుతాయనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చినట్లు విశ్వనీయసమాచారం. ఇప్పటికే పార్టీలో అనేక సవాళ్లున్నాయి. నేతల మధ్య ఐక్యతతోపాటు సమన్వయం కూడా ఎండమావిగానే ఉంది. పార్టీ బాధ్యతల విషయంలో ఇటీవల బాలినేని తన అభిప్రాయాలను,అసంతృప్తిని నేరుగా బహిర్గతం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన బావ వైవీ పాత్రపైనే విమర్శలు చేశారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ తరుణంలో పార్టీలోనే కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొంది. వీటిపై అధిష్టానం నుంచి పెద్దగా ఉన్న విజయసాయిరెడ్డి దృష్టి సారించి ఓ స్పష్టత ఇచ్చారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. మొదట మంత్రి ఆదిమూలపు సురేష్ భేటీ అయ్యారు. ఆయనకూ అక్కడ అసమ్మతులున్నాయి. అవి ఎవరివల్ల ఉత్పన్న మయ్యాయనేదీ మంత్రి ఈ భేటీలో విజయసాయిరెడ్డికి చెప్పినట్లు వినికిడి. తర్వాత ఎంపీ మాగుంట, బాలినేనితో కాసేపు చర్చ జరిపాక విడిగా ఎంపీ మాగుంటతోనూ భేటీ అయ్యారు. ఇక్కడ మాగుంట కూడా కేసులతోపాటు టిక్కెట్టుపైనా కొంత గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి బాలినేని అన్ని విధాలా మాగుంటకు అండగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాగుంటకే టిక్కెట్టు ఇవ్వాలని బాలినేని సూచించారని సమాచారం. వైవీ పాత్రపైనా ఇక్కడ చర్చకు వచ్చిందా? లేదా? అనేదీ చూడాల్సి ఉంది. ఈ చర్చలు గోప్యంగా ఉన్నందున బయట పార్టీవర్గాల్లో మాత్రం ఇప్పటి వరకూ ఉన్న పార్టీలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా ఈ తరహా చర్చలు జరిగి ఉంటాయని చెప్పుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు జంకె వెంకట రెడ్డితోనూ భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, ఇతర నియోజకవర్గాల్లో ఎలా ఉందనేదానిపై ఆయన్నుంచి ఆరా తీశారని సమాచారం. మార్కాపురం టిక్కెట్టు తనకు కేటాయించాలని జంకె కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలందరితోనూ భేటీలు జరిపారు. పశ్చిమాన ఓ నియోజకవర్గంలోని సిట్టింగు ఎమ్మెల్యేకు టిక్కెట్టుపై ధీమా కనిపించలేదంటున్నారు. వెనుకబడిన ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీలో ఇతర నేతలతో సమన్వయం, కలుపుకునిపోయే విషయంలో సమన్వయలోపాలు ఆయనతో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సి రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న ఓ ఎమ్మెల్యే భేటీలో పార్టీలో వర్గపోరుపై చర్చ సాగినట్లు తెలుస్తోంది.
పశ్చిమాన ఓ ఎమ్మెల్యేపై వచ్చిన అవినీతి ఆరోపణలు, భూభాగోతాలు చర్చలో వచ్చినట్లు సమాచారం. వీటిని సరిదిద్దుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వడం కష్టమని కూడా కొందరికి తేల్చిచెప్పినట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఇదే సమయంలో తమ నియోజకవర్గాల్లో ఇతర నేతలనుంచి వస్తోన్న ఇబ్బందులు, అసమ్మతులు, ఇతర సమస్యలను ఆయన వద్ద గోడు పెట్టుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలే కొందరు తమకు ఆటంకాలు కలిగిస్తున్నారని, ద్వితీయశ్రేణి నేతలతో ఎదురువుతోన్న ఇబ్బందులు, వారికి తెరచాటు ఎవరి సహకారం ఉందనే విషయాలు కూడా విజయసాయిరెడ్డికి పలువురు వివరించినట్లు సమాచారం. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా దర్శి టిక్కెట్టు తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. నేతలతో భేటీలు తర్వాత కొండపి నియోజకవర్గం ముఖ్యనేతలతోపాటు మండలస్థాయి ప్రజా ప్రతినిధులతోనూ బాలినేనితో కలిసి విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఇది కూడా వాడివేడిగానే సాగింది. ఏదేమైనా మొదటి రోజు సమావేశం జరిగిన తీరు పార్టీలో ఎలాంటి పరిస్థితులున్నాయనేది విదితమైంది.

