మిశ్రమ పంటల సాగు, ప్రధాన పంటలో మిశ్రమ పంటలుగా చిరుధాన్యాల సాగు రైతులకు మేలు కలిగిస్తుందని మండల వ్యవసాయాధికారి బి ప్రసాద రావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో పర్యటించి అంతర్ పంటలుగా చిరుధాన్యాల సాగు చేసే రైతులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మిశ్రమ ఆహార పంటల సాగు ద్వారా భూమిలో జీవవైవిద్యం పెంపొందుతుందని దీనివల్ల భూమి సారవంతం అవ్వడమే కాక ఆహార ఉత్పత్తి జరిగి చిన్న, సన్న కారు రైతులకు లాభాన్ని చేకూరుస్తుందని ఆయన అన్నారు. ప్రధాన పంటలో అంతర్ పంటలుగా రాగులు, సజ్జలు, జొన్నలు, తదితర పంటలతో పాటు పప్పు ధాన్యాలైన కంది, పెసర,అలసంద, తదితర పప్పు ధాన్యాలను పండించడం వల్ల నత్రజని ఎక్కువగా తీసుకొని ప్రధాన పంటకు మేలు కలిగిస్తుందని ఆయన అన్నారు. అందువల్ల రైతులు అంతర్ పంటలుగా చిరుధాన్యాల వైపు దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగరాజు, గ్రామ వ్యవ సాయ సహాయకులు అజ్మీర్, రైతులు పాల్గొన్నారు.
