శింగరాయకొండలోని దేవాదాయ భూముల విషయంలో స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
చెప్పారు. బుధవారం శింగరాయకొండలోని గంజివారి కళ్యాణ మండపంలో జరిగిన మండల స్థాయి స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొండేపి నియోజకవర్గ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఉమాదేవి, నారదముని, సి.పి.ఓ. వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అధికారులను, అర్జీదారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 263 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. శింగరాయకొండలోని సుమారు 1300 ఎకరాల దేవాదాయ భూములలో ఇళ్లు నిర్మించుకున్న వారికి, ఎన్నో ఏళ్ల నుంచి పొలాలు సాగు చేస్తున్న వారికి వాటిపై హక్కులు కల్పించాలని ప్రజలు ప్రధానంగా తన దృష్టికి తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించడానికి జాయింట్ కలెక్టర్ అద్యక్షతన దేవాదాయ, సర్వే, పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమిస్తానని చెప్పారు. ఈ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తమకు ఏ.పి.ఐ.ఐ.సి. లేఅవుట్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని వడ్రంగి కార్మికులు చేసిన విజ్ఞప్తిపైనా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శింగరాయకొండలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే జడ్.పి. నుంచి నిధులు ఇచ్చేలా చూస్తామన్నారు.
స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో మండల స్థాయిలో స్పందన కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలంలోనూ స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. స్పందన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చి సహేతుకంగా, సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పిటిషన్లను పరిష్కరించాలని, స్థానికంగా పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా వారికి వివరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు ఈ అర్జీలను పరిష్కరిస్తున్న తీరును జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఆయన
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎం.పి.డి.ఓ. జమీఉల్లా, తహసీల్దార్ సి. హెచ్. ఉష, అన్ని శాఖల మండల అధికారులు, శింగరాయకొండ సర్పంచ్ శ్రీమతి తాడిపర్తి వనజ పాల్గొన్నారు.
శింగరాయకొండలోని దేవాదాయ భూముల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారానికి తగిన చర్యలు – జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
27
Sep