పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. ఈ దిశగా వారి విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమన్నారు. ఒంగోలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు కార్పొరేషన్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు, పి.పి.ఈ. కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏ దినేష్ కుమార్ మాట్లాడుతూ… మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని ఆయన కొనియాడారు. వీరితోపాటు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రజా వైద్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలో పేతం చేస్తోందని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను సైతం అమలు చేస్తూ క్షేత్రస్థాయిలోనే వైద్య సేవలు అందిస్తోందని చెప్పారు. ఈ క్రమంలో పారిశుధ్య కార్మికుల కోసం ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్, గైనకాలజీ, చర్మ వ్యాధులు, బి.పి., షుగర్ తదితర వ్యాధులకు స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రత్యేకంగా ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయడంతో పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చేలా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ వైద్యులతోపాటు ఇందులో ఉపాస్, ఆస్టర్ రమేష్ వైద్యులు కూడా భాగస్వాములు కావడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ… అందరి ఆరోగ్యం కోసం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ బాధ్యతను మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కూడా ఈ ప్రక్రియలో తమతో కలిసి రావడం సంతోషకరమన్నారు. డివిజన్ల వారీగా పారిశుధ్య కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకునేలా నిర్దిష్ట ఏర్పాట్లతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వి.సూర్య నారాయణ, మాధవరావు, కమిషనర్ ఎం. వెంకటేశ్వరావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాస్ వైద్యులు ఉమాపతి, ప్రకాష్, అనీల్ కుమార్, శ్రీనివాసరావు, ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వైద్యులు సిహెచ్. శ్యామ సుందరి, కె.ప్రతిమ, తదితరులు పాల్గొన్నారు.


