ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగ ఓటర్ల ఓటింగ్ శాతం పెంచాలని పలు మార్లు రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయానికి విన్నవించిన వివక్షగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నవ్యాంద్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాలేషా మాట్లాడుతూ దివ్యాంగుల ఓట్లు హక్కు వినియోగించుకోవటానికి వీలుగా వీల్ చైర్స్, ర్యాంప్లు ఏర్పాటు చేస్తున్నామని ఆర్భాటాలు చేసారు ….కాని దివ్యాంగుల ఇంటికి వెళ్లి పరిశీలించి మంచాలకు పరిమిత మైన దివ్యాంగులకు ఓటు హక్కు ఇంటి నుండి కల్పించే విషయమై తగిన చర్యలు తీసుకోవటంలో అధికారులు పూర్తిగా విఫలమైనారని అన్నారు. ఎప్రియల్ 1న ,6 ఏప్రియల్ న పలు మార్లు ఎన్నికల కమీషన్ కార్యాలయానికి విన్నవించినా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఎన్నికల కమీషన్, కార్యాలయ సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సకలాంగుల వలే దివ్యాంగులు పదే పదే రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఎన్నికల కమీషన్ కానీ, కార్యాలయ సిబ్బంది కానీ దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించ పరచటం మంచిది కాదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుని దివ్యాంగుల ఓటింగ్ శాతం పెంచాలని కాలేషా కోరారు.

