రోహిణి కార్తెలో అధిక ఉష్ణో గ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి మౌనిక తెలిపారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో వడ దెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ… వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు. దీంతో వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ కు గురికావడం జరుగుతుందన్నారు. వడదెబ్బ తగిలినప్పుడు చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారకస్థితి వంటి లక్షణాలు ఉన్నచో దాన్ని వడదెబ్బగా భావిం చాల్సి ఉంటుందన్నారు.
నివారణ చర్యలు….
నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలన్నారు. లేత వర్ణం, తేలికైన కాటన్ దుస్తులు ధరించాలన్నారు. రోజూ కనీసం 15 గ్లాసుల నీరు తాగాలని చెప్పారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, రెండు పూటలా స్నానం చేయడం, భోజనం మితంగా తీసుకోవాలన్నారు. ఎండకు వెళ్తే టోపీ గానీ గొడుగు గానీ వెంట తీసుకెళ్లాలని చెప్పారు. ఇంట్లో కిటికీలన్నీ తెరిచి ఉంచాలన్నారు. వీటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
