శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః
ఏవం విష్ణుమయం శివః
శివ కేశవులకు భేదం లేదు, శివస్వరూపంలోని విష్ణువే విష్ణురూపంలోని శివుడు. ఒకరు సృష్టికర్త మరొకరు లయకారకులు. ఇద్దరూ వేర్వేరుకాదు ఒక్కరే… మహిమాన్వితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీగిరి పై కొలువైయున్న శ్రీహరిని సామూహికముగా దర్శించుకొనుటకు శ్రీగిరి ప్రదక్షిణ మహాశివరాత్రి పర్వదినం రోజున నిర్వహించుకోవడం శ్రీవారి భక్తులుగా మనందరం అదృష్టవంతులం అనడంలో ఎలాంటి సందేహం లేదని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం అన్నారు. ఈరాత్రికి అభిషేక ప్రియుడు మహాశివుని లింగోద్భవం ఈ పగలు అలంకార ప్రియుడు శ్రీ వేంకటేశ్వరుని జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం ఈ రెండు ప్రత్యేకమైన రోజులో గిరి ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం అత్యంత ఆనందదాయకమని అన్నారు. గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ శాల వద్ద గోపూజ నిర్వహించుకుని వందలాది భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీనివాసుని కొలువు తీర్చి ఎంతో ఉత్సాహంగా స్వామివారి పల్లకిని తమ భుజస్కంధాలపై పెట్టుకొని భక్తులు గిరిప్రదక్షిణ పూర్తి చేశారు. శ్రీగిరి చేరి శ్రీనివాసుని దర్శించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. మార్గమధ్యలో భగీరథ మహర్షి మందిరం వద్ద సగరపుత్రులు గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు పాల ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
గిరి ప్రదక్షిణ కమిటీ కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు దాసరి నారాయణరావు, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహకార దర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, చలువాది బ్రహ్మయ్య, ధనిశెట్టి రామునాయుడు, గో సంఘం వాసు, సామి రాఘవేంద్రరావు, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, కనమర్లపూడి బాల, దేసు చిన్నా తదితరులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.





