రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందడమే లక్ష్యంతో పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, తమీమ్ అన్సారియా, విద్యా శాఖాదికారులతో సమావేశమై జి. ఓ 117, డ్రాప్ అవుట్స్ తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….. జీవో 117ను ఉపసంహరించిన తర్వాత అందుకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించి ఇప్పటికే సన్నాహక మార్గదర్శకాలపై ఉత్తర్వులు కూడా విడుదల చేసిందన్నారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో కూడా సంబంధిత విద్యా శాఖల అధికారులు, పాఠశాలల అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో అధ్యయనం చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలుపై పిల్లల తల్లితండ్రులను సంప్రదించి వారికి వివరించి తరువాత వారి అభిప్రాయాలను తెలుసుకునేలా ఎంఈఓ లు గ్రామపంచాయతీ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆ పంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాల కమిటీల సమావేశంలో స్కూళ్ల వివరాలను వారికి అర్థమయ్యే విధంగా వివరించి నిర్ణయాలను లిఖితపూర్వకంగా ఆమోదం పొందే విధంగా అందరూ ఎంఈఓ లు చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ అమలు ప్రక్రియలో మండల మరియు క్లస్టర్ కమిటీల ఏర్పాటు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తో సంప్రదించి, తల్లిదండ్రుల అంగీకారంతో ఈ పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ ప్రక్రియ అమలు గురించి శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మండల విద్యా శాఖాధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తీ చేసేలా విద్యా శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. డ్రాప్ అవుట్ పిల్లలు ఎందుకు డ్రాప్ ఓట్ అవుతున్నారో గుర్తించి వారిని బడిలో చేర్పించేలా విద్యా శాఖాదికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాదికారి ఎ కిరణ్ కుమార్, జిల్లాలోని మండల విద్యా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.


