నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గల డాగ్ స్క్వాడ్ యూనిట్ ను జిల్లా ఎస్పీ సందర్శించి, డాగ్ స్క్వాడ్ యూనిట్ పరిసరాలను, అక్కడ ఉన్న వివిధ జాగిలాలను, వాటి గదులను, అందించే ఆహారాన్ని, వాటికి ఉపయోగించే వివిధ రకాల పరికరాలను పరిశీలించారు.
జాగిలాలకు సంబంధించిన పలు విషయాలు గురించి డాగ్ హ్యాండ్లర్స్ ఎస్పీ కి వివరించారు. జాగిలాల ఆరోగ్య పరిస్థితిని, వాటికి అందించే ఆహార గురించి అడిగి తెలుసుకుని వాటి యొక్క శ్రద్ధ, ప్రతిస్పందనను పరిశీలించారు. ప్రేలుడు పదార్థాలను పసిగట్టే నాలుగు జాగిలాలు, క్రైమ్ ట్రాకర్స్ రెండు జాగిలాలు యొక్క పనితీరును ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
వేసవి కాలం దృష్ట్యా డాగ్ స్క్వాడ్‌లోని జాగిలాలకు వాతావరణం అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా జాగిలాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఐదు కొత్త కూలర్లను అందజేశారు. మెరుగైన నేరవిచారణకు దోహదపడే విధంగా జాగిలాలకు శిక్షణ ఇవ్వాలని, కొత్త మెళుకువలను నేర్పించాలని, సమయానికి ఫీడింగ్ అందించాలని, వాటి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాగ్ స్క్వాడ్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ …. పోలీస్ శాఖలో డాగ్ స్క్వాడ్ ఒక ముఖ్యమైన విభాగమని, నేరాల దర్యాప్తులో మరియు శాంతిభద్రతల పరిరక్షణలో శిక్షణ పొందిన జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దొంగతనాలు, పేలుడు పదార్థాల గుర్తింపు, ప్రమాదకర ప్రాంతాలకు చేరుకోవడం, వీఐపీ ల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ జాగిలాలు అత్యంత ముఖ్యమన్నారు. నేరాలు జరిగినప్పుడు ఘటనా స్థలంలో పోలీసు జాగిలాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి నిందితులను వాసన ద్వారా పసిగడతాయని, ముఖ్యంగా స్నిఫర్ డాగ్ (వాసన చూసి పసిగట్టడం)తనిఖీ సమయంలో పేలుడు పదార్ధాలు మరియు భద్రతా తనిఖీల అంశాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
నేర పరిశోధనలో నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో పోలీస్ జాగిలాల పనితీరు అమోఘమైనదని, అలాంటి పోలీస్ జాగిలాలకు నిరంతరం శిక్షణ అందిస్తూ, ఉత్సాహవంతమైన విధి నిర్వహణకు సిద్ధంగా ఉంచాలని డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్స్ ను ఆదేశించారు. ఎస్పీ సిబ్బందితో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
జిల్లా ఎస్పీ వెంట ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణ రెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.


