బేగంపేట ఏప్రిల్ 26 :
రాష్ట్ర సాధన కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ 25 వసంతాల వేడుకలను జరుపుకోవడం ఒక చరిత్ర అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆదివారం వరంగల్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 27 వ తేదీన ఉదయం 10.00 గంటలకు డివిజన్ లలో పార్టీ పతాకాలను ఎగురవేసి సభకు బయలుదేరాలని పిలుపునిచ్చారు. జెండా ఆవిష్కరణ చేసే ప్రాంతాలలో జెండాలు, తోరణాలతో సుందరంగా అలంకరణ చేయాలని చెప్పారు. సభకు వచ్చే వారికోసం పార్టీ ఆధ్వర్యంలో ఆర్ టి సి బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చారిత్రాత్మక సభకు బస్తీలు, కాలనీల నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ విజయవంతం చేసేందుకు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన ఉద్యమ పార్టీగా టి ఆర్ ఎస్ ఆవిర్భవించిందని చెప్పారు. 14 సంవత్సరాల పాటు అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రంను సాధించడం జరిగిందని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో కే సి ఆర్ నాయకత్వం లో ఎంతో అభివృద్ధి సాధించిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎంతో విసిగిపోయారని, ఎందుకు కాంగ్రెస్ ను గెలిపించామా అని మదనపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో తాము మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని, తిరిగి బి ఆర్ ఎస్ ప్రభుత్వం, కే సి ఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
*పెహల్గాం మృతులకు నివాళులు*
ఈ నెల 22 వ తేదీన పెహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషమని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా సమావేశంలో 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేషన్ రాజు, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు అశోక్ యాదవ్, నాగులు, ఏసూరి మహేష్, శ్రీహరి, నరేందర్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, కర్ణాకర్ రెడ్డి, కిషోర్, ఆంజనేయులు, శేఖర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.





