కంటోన్మెంట్ మే 6 (జే యస్ డి ఎం న్యూస్) :
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా టిపిసిసి పరిశీలకులు కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, రాచమల్ల సిద్దేశ్వర్, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి పార్టీ అభివృద్ధికి సూచనలు సలహాలు స్వీకరించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పట్టుగొమ్ములని, కార్యకర్తలు, నాయకుల కృషి ఫలితమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా ప్రతి కార్యకర్త అహోరాత్రులు కష్టపడి పని చేశారని ,వారిని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత తనదని, నియోజకవర్గంలో పార్టీ తరఫున గాని, ప్రభుత్వం తరఫున గాని వచ్చే పదవులలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు మాత్రమే అవకాశం ఉంటుందని, రాబోయే రోజులు చాలా కీలకమని, బిజెపి, బీ ఆర్ ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీపై విషం చిమ్ముతున్నాయని, సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయని, ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయని, ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి వారు చేయని ప్రయత్నం లేదని, కార్యకర్తలు నిత్యం అప్రమత్తంగా ఉండి వారి విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని, ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ప్రతి పేదవాడికి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, కనీ విని ఎరుగని రీతిలో రైతు రుణమాఫీ చేశామని, రైతు బంధు అమలు చేస్తున్నామని, ముఖ్యంగా హైదరాబాదు నగరాన్ని మరింతగా అభివృద్ధి పరిచే క్రమంలో భాగంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, నగరం నలుదిక్కుల మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు తయారు చేశామని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టి నగరాన్ని మరింత సుందరంగా, ట్రాఫిక్ కష్టాలు లేని నగరంగా అభివృద్ధి చేయబోతున్నామని, దావోస్ పర్యటనలో, జపాన్ పర్యటనలో భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చామని, వీటన్నిటిని ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని, ప్రభుత్వానికి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వారధులని, మీ కష్టం ఊరికే పోదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలందరికీ సమున్నత స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
