సచివాలయ సిబ్బంది క్రమశిక్షణ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు. బుధవారం ఆమె ఒంగోలు శివారులోని కొప్పోలు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా స్థానికులకు అందుతున్న సేవలపై అరా తీసారు. రీ సర్వే డేటాను కలెక్టరే కంప్యూటర్ లో పరిశీలించారు. ఆధార్ కార్డ్ లేని చిన్నారులు సచివాలయం పరిధిలో ఎంత మంది ఉన్నారు? వారికి ఆధార్ కార్డ్స్ అందేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని మహిళా సంరక్షణ కార్యదర్శిని ప్రశ్నించారు. ఇందుకు సంబంధిచిన రికార్డ్స్ ను తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది వేస్తున్న బయోమెట్రిక్ హాజరు వివరాలను కలెక్టరు పరిశీలించారు. కొందరు సిబ్బంది 11 గంటలకు వచ్చినట్లు ఆమె గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసారు. సమయ పాలన, సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. సచివాలయ పరిధిలో శానిటేషన్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసారు.
