రాష్ట్రంలో నిర్వహించబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు యోగా వలన కలిగే ఉపయోగాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంతోషం, ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ దిశగా గ్రామస్థాయిలోనూ అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కలెక్టర్ చేశారు. గ్రామస్థాయిలో ప్రధానమైన స్థలాల్లో వాల్ పెయింటింగ్స్, తదితర రూపాలలో ప్రజలకు అవగాహన కల్పించి ఈ యోగా దినోత్సవం లో విస్తృతంగా పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఈ దిశగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో కనీసం 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 21 లోగా వివిధ రూపాలలో నిర్వహించే పోటీలలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ. వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లా ఆయుష్ అధికారి భీమ్ నాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

