ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం కొండపి నియోజకవర్గం, మర్రిపూడి మండలం, చిలంకూరు గ్రామంలో మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి, లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందించారు. ఈ సందర్బంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….తమ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సమర్దంగా అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్దికంగా సంక్షేభంలోనికి నెట్టినా సమర్దవంతమైన నాయకత్వంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఎన్డిఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు మంత్రి అన్నారు. హామీల్లో భాగంగా పించన్ ను పెంచి ప్రతి నెలా ఒకటవ తేదీనే అందచేయడం జరుగుచున్నదన్నారు. ఒకటవ తేదీ ప్రభుత్వ సెలవు వస్తే ముందు రోజే పించన్ అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీపం పధకం కింద ఉచిత గ్యాస్ పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అలాగే త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ క్రింద కేంద్ర ప్రభుత్వ ఇచ్చే మొత్తంతో కలిపి 20 వేల రూపాయలు, కుటుంబంలో ఎంతమంది పిల్లలు వుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పధకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్.సి, బిసి లబ్దిదారులకు మూడు లక్షల రూపాయలు, ఎస్.టి లబ్దిదారులకు మూడు లక్షల 25 వేలు, ఓసి లకు రెండు లక్షల 50 వేలు ఇంటి నిర్మాణానికి ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ నెలకు 4 వేలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. దివ్యాంగులకు 6 వేల నుండి 15 వేలు, దీర్గకాలిక వ్యాధిగ్రస్తులకు 10 వేలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,718 కోట్ల రూపాయలు పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో 124 కోట్ల రూపాయలు, కొండపి నియోజక వర్గంలో 18 కోట్ల 19 లక్షల 88 వేల రూపాయలు, మర్రిపూడి మండలంలో 2 కోట్ల 38 లక్షల 71 వేలు, చిలంకూరు గ్రామంలో 10 లక్షల 6 వేల 500 రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. నియోజక వర్గంలో రోడ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యతఇస్తూ రోడ్డు మరమ్మతులు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. పొగాకు రైతులకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్దికి ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్దిని, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఎంపీడీవో జగదీశ్వర రావు, తహసిల్దార్ జ్వాలా నరసింహారావు , ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



