బేగంపేట జూన్ 10 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట్ కు చెందిన గోస్వామి రాము మతిస్థిమితం కోల్పోయి సౌదీ అరేబియా లోని మదీనాలో ఒక ఆసుపత్రిలో చేరాడు. తాటికల్లు, ఈతకల్లు లో డైజోఫాం, క్లోరోఫాం లను కలిపి తయారు చేసిన గుల్ఫారం కల్లు కు బానిసైన రాము సౌదీకి చేరుకున్న రెండు మూడు రోజులకే మతిస్థిమితం తప్పి పోయాడు. అనంతరం అతన్ని అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.సౌదీ లోని మదీనా ఆసుపత్రి నుంచి రామును ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని భార్య సవిత, కుమారుడు ఉమేష్ మంగళవారం హైదరాబాద్ లోని ప్రవాసి ప్రజావాణి లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి లకు గల్ఫ్ బాధితుని కుటుంబ సభ్యులు సమస్యను వివరించారు. కామారెడ్డి ఆర్డీఓ వీణ సూచన మేరకు ప్రవాసి ప్రజావాణికి చేరుకున్న రాము కుటుంబ సభ్యులు సీనియర్ ఐఏఎస్ అధికారిణి, సీం ప్రజావాణి ఇంచార్జి దివ్యా దేవరాజన్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వెంటనే స్పందించిన దివ్యా దేవరాజన్ జిద్దా లోని ఇండియన్ కాన్సులేట్ కు తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై విభాగం ద్వారా సమాచారం ఇచ్చారు.అతన్ని రాష్ట్రానికి రప్పించేందుకు అధికారులతో మాట్లాడారు.
