పలు అభివృద్ధి కార్యక్రమాలపైజిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సమీక్ష

        తల్లికి వందనం పథకం కింద ఆర్థిక ప్రయోజనం దక్కలేదంటూ వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం మండల స్థాయి అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రకాశం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
            ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల వివరాలను,  అనర్హుల వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ తమకు ప్రయోజనం కలగలేదని అర్జీలు వస్తే వాటిని తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ ఈ పథకం కింద ప్రయోజనం దక్కాలి అన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఏయే కారణాల వలన ఆర్థిక ప్రయోజనం దక్కలేదో సంబంధిత శాఖల అధికారుల ద్వారా వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు.
            ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 10 లక్షల మంది ప్రజలతో యోగాసనాలు వేయించేలా ఇస్తున్న శిక్షణలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అందరూ పాల్గొనేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. యోగాసనాలు వేసే వేదికలను, పాల్గొనే వారికి ఇచ్చే సర్టిఫికెట్లను ఇప్పటినుంచే సిద్ధం చేయటంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశం చేశారు. యోగా వలన కలిగే ఆరోగ్య
ప్రయోజనాలను ప్రజలకు వివరించి యోగాసనాలను నిత్యజీవితంలో భాగం చేసుకునేలా చూడాలన్నారు.
              ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఫారం పాండ్స్, ఫిషింగ్ పాండ్స్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఫారం పాండ్స్
నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతలను కూడా తవ్వించాలన్నారు. ప్రస్తుతం రోజువారీ  సగటు కూలి రూ. 251 గా ఉందని, దీనిని రూ.275 కు తగ్గకుండా చూడాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా మొక్కలను పెంచడంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ, ఇతర ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకుని స్థానిక వాతావరణ పరిస్థితులకు తగిన మొక్కలను రైతులు నాటేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ” వనం – మనం ” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు,  పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, హాస్టళ్ల ప్రాంగణాలలో మొక్కలను విరివిగా నాటి,  వాటి సంరక్షణ బాధ్యతను సంబంధిత కార్యాలయాల అధికారులకు , సిబ్బందికి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగులో ఉన్న గోకులం షెడ్డుల నిర్మాణ బిల్లులు వారం రోజుల్లో జమ అవుతాయని ఆమె తెలిపారు.
                హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని కేవలం ఇళ్ల నిర్మాణానికే వారు వినియోగించేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. ప్రతి వారం ఇళ్ల నిర్మాణంలో పురోగతి స్పష్టంగా కనిపించేలా పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. ఆరేళ్ల లోపు చిన్నారులందరూ ఆధార్ కార్డులు పొందేలా చూడాలని చెప్పారు. పాఠశాలల్లో టాయిలెట్లను తనిఖీ చేసి సంబంధిత ఫోటోలను యాప్ లో రెగ్యులరుగా అప్లోడ్ చేసేలా చూడాలని స్పష్టం చేశారు. సిటిజన్ ఈ-కేవైసీ కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
           ఈ వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పి సీఈవో చిరంజీవి, డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, హౌసింగ్ పీ.డీ. శ్రీనివాస ప్రసాద్, డి. ఎం. హెచ్. ఓ. వెంకటేశ్వర్లు, డి.పి.ఓ. గొట్టిపాటి వెంకట నాయుడు,  బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *