స్వయం సహాయక సంఘాల సభ్యులతో రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమం నిర్వహణ – ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ఏ తమీమ్ అన్సారియా,ఎస్ పి ఏ ఆర్ దామోదర్, ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు

ఈ నెల 21న జిల్లాలో జరగనున్న అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో 6,458 ప్రదేశాల్లో సుమారు 11 లక్షల మందితో ఒకే సమయంలో యోగ కార్యక్రమం నిర్వహించబడునని, ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు.
శుక్రవారం ఉదయం ఒంగోలులోని మినీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, ఒంగోలు నగర గంగాడ సుజాత, జిల్లా ఎస్ పి ఏ ఆర్ దామోదర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… ఈ సంవత్సరం 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోని వైజాగ్ లో జరిగే యోగ కార్యక్రమంలో గౌరవ భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్గోనబోతున్నట్లు తెలిపారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు, ఒక లక్షా 50 వేల ప్రదేశాల్లో ఒకే సమయంలో యోగ సాధన చేయబోతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో భాగంగా గత నెల మే 21వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో యోగ పై అవగాహన కల్పించేలా యోగాంధ్ర కాంపెయిన్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో 11 లక్షల మంది ప్రజలను యోగ కోసం రిజిస్టర్ చేసి వారందరికీ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రేపు జిల్లాలో జరగనున్న అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో 6,458 ప్రదేశాల్లో ఒకే సమయంలో యోగ కార్యక్రమం నిర్వహించబడునని కలెక్టర్ వివరించారు. ఈ రోజు వచ్చిన స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇదే స్పూర్తి తో రేపు జరగనున్న యోగ దినోత్సవ వేడుకల్లో ప్రజలు, విద్యార్ధులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. 21వ తేదీ యోగ దినోత్సవం అనంతరం కూడా ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రజలను కోరారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ.. భారత దేశంలో పుట్టిన యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరిన మీదట ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించడం జరిగిందని, అప్పటినుండి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. రేపు జరగనున్న 11వ అంతర్జాతీయ దినోత్సవం రోజున వైజాగ్ లో భారత ప్రధానమంత్రి పాల్గొను యోగ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పాల్గొనుచున్నారన్నారు. ఆరోగ్య ఆంద్ర లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో యోగ యొక్క ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర క్యాంపెయిన్ ను విస్తృతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగ ను జీవన శైలిలో భాగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని, రేపు జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని యోగ దినోత్సవాన్ని జయప్రదం చేయాలన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ.. నేటి దైనందిన జీవితంలో అనేక ఒత్తిడి లు, సమస్యలతో జీవనం సాగిస్తున్న తరుణంలో వాటిని అధికమించాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి రోజు యోగ సాధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన ఆరోగ్యాన్ని, మన ఆశయాన్ని, మన అభివృద్దిని సాధించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చునన్నారు. యోగను ప్రజలందరి జీవితంలో భాగం చేయడానికి జిల్లాలో నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. రేపు జరగనున్న యోగ దినోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొని అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
జిల్లా ఎస్పి ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ… 2047 లో ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ను సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర క్యాంపెయిన్ ను నెల రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. యోగ యొక్క గొప్పతనాన్ని తెలియ చేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యంగా మహిళలకు యోగ పట్ల అవగాహన కల్పించినట్లయితే ఆ కుటుంబం ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా గాయకులు శరత్ కుమార్ రూపొందించిన యోగ గేయాన్ని ఆవిష్కరించి గేయాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డిఆర్డిఏ, మెప్మా పిడి లు నారాయణ, శ్రీహరి, ఆయుష్ శాఖ ఆర్డిడి పద్మజాతి, జిల్లా విద్య శాఖాధికారి కిరణ్ కుమార్, పశు సంవర్థక శాఖ జేడి రవి కుమార్, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *