తల్లికి వందనం పథకంలో గ్రీవెన్స్ లను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా -మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

తల్లికి వందనం పథకంలో గ్రీవెన్స్ లను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలపై సోమవారం ఆమె ప్రకాశం భవనము నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తల్లికి వందనం పథకంలో ఈ-కేవైసీలను మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్ పథకంలో ప్రతివారం స్పష్టమైన పురోగతి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పలు మండలాలలో ఏ.ఈ.ఈ. పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఇది ప్రభావం చూపుతున్నదని హౌసింగ్ పి.డి. శ్రీనివాస ప్రసాద్ ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ చురుకుగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. మంగళవారం సాయంత్రంలోగా దీనికి సంబంధించిన జాబితాను తనకు పంపాలన్నారు. ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. వచ్చామా… నా పని చేసుకున్నామా… వెళ్ళామా… అనే ధోరణితో కాకుండా ప్రజలతో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ చెప్పారు. సిబ్బంది పనితీరుతో పాటు ప్రవర్తన కూడా అత్యంత కీలకమని ఆమె ఉద్ఘాటించారు.
పీ – 4 పథకంలో మార్గదర్శకులను త్వరగా గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే గుర్తించిన జాబితాలో అర్హులకు స్థానం లేనట్లయితే అలాంటి వారిని కూడా గుర్తించేందుకు గ్రామ సభలను త్వరగా నిర్వహించాలని అన్నారు. పారిశుద్ధ్యంతో పాటు ఇతర సేవలపై ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రభుత్వం నేరుగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున ఆయా సేవల నిర్వహణలో
నిర్లక్ష్యం ఎంతమాత్రమూ ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిపై స్థానిక అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని
ఆమె చెప్పారు.
ఉపాధి హామీ పథకములో వ్యవసాయ అనుబంధ పనులు చేపట్టడానికి అధిక ప్రాధాన్యమిచ్చి వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు, ఫారం పాండ్స్,
ఫిషింగ్ పాండ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ పనులు ఇంకా ఊపందుకోనందున ఉపాధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సగటు రోజువారీ వేతనం కూడా పెరిగేలా చూడాలన్నారు. నీటి
సంరక్షణ కోసం చేపట్టే పనుల ఫోటోలను తనకు పంపించడంతో పాటు సంబంధిత కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో కూడా అప్లోడ్ చేయాలని అన్నారు. పల్లె పండుగ -2 లో భాగంగా ప్రభుత్వం మన జిల్లాకు 1458 క్యాటిల్ షెడ్స్ ను లక్ష్యంగా నిర్దేశించినందున వీటికి త్వరగా అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టేలా దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, జడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పీ.డీ. జోసఫ్ కుమార్, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, సిపిఓ స్వరూప రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *