జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టల్లో అడ్మిషన్లు పెంచాలని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి సూచించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్. నిర్మల జ్యోతి సోమవారం నాడు తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి డా. స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం, హాస్టళ్లలో ప్రవేశాల పెంపు తదితర అంశాలపై మంత్రి ఆమెతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ… సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. జిల్లాలోని బీసీ హాస్టల్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టాలని మంత్రి డా.స్వామి ఆమెకు సూచించారు.
